సీటెట్ ఎగ్జామ్ 4 సిటీల్లోనే

సీటెట్ ఎగ్జామ్ 4 సిటీల్లోనే

 

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటెట్) సెంటర్ల సంఖ్య రాష్ట్రంలో తగ్గింది. 2022లో ఆరు సిటీల్లో పరీక్షలు నిర్వహించగా, ఈసారి దాన్ని నాలుగుకే పరిమితం చేశారు. జులై, ఆగస్టు నెలల్లో జరిగే ఈ పరీక్షను హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ మాత్రమే నిర్వహిస్తామని సీబీఎస్ఈ ప్రకటించింది. కరీంనగర్, నల్లొండ సెంటర్లను తొలగించింది. కాగా, ఏపీలో ఏకంగా 12 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నర్సరావుపేట, ఒంగోలు,  రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లో పరీక్షా కేంద్రాలు పెట్టారు. మరోపక్క సీటెట్ దరఖాస్తుల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది.

మే 26 వరకూ ఆన్​లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. అయితే, గత సీసెట్ ఎగ్జామ్ కు తెలంగాణ నుంచి సుమారు 40వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అంతమంది పరీక్ష రాసేందుకు ఇక్కడ అవకాశం లేకపోవడంతో, చాలామంది తెలంగాణ అభ్యర్థులకు ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల్లోనూ సెంటర్లు పడ్డాయి. ఈ సారి తెలంగాణ ప్రభుత్వం స్టేట్ లెవెల్ టెట్ నిర్వహించలేదు. దీంతో ఈ సీటెట్ పరీక్ష రాసేందుకు చాలామంది అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయినా, సీబీఎస్ఈ బోర్డు మాత్రం తెలంగాణలో సెంటర్లు తగ్గించడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.