ప్రతి పోలింగ్ కేంద్రం బయట సీసీ కెమెరా తప్పనిసరి : కమిషనర్ రాణి కుముదిని

ప్రతి పోలింగ్ కేంద్రం బయట సీసీ కెమెరా తప్పనిసరి : కమిషనర్ రాణి కుముదిని
  • రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశం
  • మూడు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు: ప్రతి పోలింగ్ కేంద్రం బయట సీసీ కెమెరా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని స్థాయిల్లో పూర్తి సన్నద్ధతతో ఉండాలని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌‌లోని రాష్ట్ర ఎన్నికల ఆఫీసు నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు

. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో కమిషన్ విడుదల చేస్తుందని, షెడ్యూల్ రాగానే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, పులపాలక ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ పరిశీలన, పోలింగ్ నిర్వహణ కౌంటింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రణాళికా బద్ధంగా సిద్ధం చేసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉండాలని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను బైండోవర్ చేయాలని చెప్పారు. ఎన్నికల ప్రచార పరిశీలన, కౌంటింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద సాధ్యమైనంత మేర డ్రోన్ కెమెరాలను వినియోగించాలని అన్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి మాస్టర్ ట్రైయినర్లు జిల్లాకు చేరుకుంటారని, సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలక్టోరోల్ కు సంబంధించిన అన్ని ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్, రిసిప్షన్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు.

నామినేషన్ కేంద్రాల్లో వాచ్​ ఏర్పాటు చేయాలి

నామినేషన్లు స్వీకరించే కేంద్రాల్లో గోడ గడియారం ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహణకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఆర్వోలు, ఏఆర్‌‌ఓల నియామకాలు వెంటనే పూర్తి చేయాలని సూచించారు.