గోల్డ్​ నాణ్యతకు సర్కార్​ హాల్​మార్క్​ తప్పనిసరి

గోల్డ్​ నాణ్యతకు సర్కార్​ హాల్​మార్క్​ తప్పనిసరి
  • వచ్చే నెల 1 నుంచి మరో 32 జిల్లాల్లో బంగారు నగలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి
  • ఇప్పటికే 256 జిల్లాలలో అమలు

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌, వెలుగు: దేశంలో గోల్డ్‌‌ హాల్‌‌మార్కింగ్ తప్పనిసరి అవుతోంది. పాలసీలో  రెండో దశను వచ్చే నెల 1 నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగా అదనంగా దేశంలోని 32 జిల్లాలలో గోల్డ్ హాల్‌‌మార్కింగ్‌‌ తప్పనిసరి కానుంది. మొదటి దశ కింద కిందటేడాది జూన్ 16 నుంచి 256 జిల్లాలలో బంగారు నగలపై హాల్‌‌మార్కింగ్ ఉండడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జ్యువెలర్లు ఈ కొత్త పాలసీకి అలవాటు పడడానికి నవంబర్, 2021 వరకు ప్రభుత్వం టైమ్‌‌ ఇచ్చింది కూడా. అసలు  గోల్డ్ హాల్‌‌మార్కింగ్ అంటే ఏంటి? ఎందుకు  ఈ కొత్త రూల్స్‌‌ను తీసుకొచ్చారో చూద్దాం.

హాల్‌‌మార్కింగ్ అంటే..

నగలు, ఇతర ప్రొడక్ట్‌‌లలో గోల్డ్‌‌ వంటి  మెటల్స్‌‌  పరిమాణాన్ని, నాణ్యతను హాల్‌‌మార్కింగ్‌‌ సూచిస్తుందని  ప్రభుత్వానికి చెందిన  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్‌‌ (బీఐఎస్‌‌) చెబుతోంది. అంటే హాల్‌‌మార్కింగ్ ఉంటే ఆ ప్రొడక్ట్ నాణ్యతకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉందని అర్థం.  గోల్డ్‌‌ హాల్‌‌మార్కింగ్‌‌తో కన్జూమర్లకు ప్రయోజనమని ఎనలిస్టులు చెబుతున్నారు. దేశంలో 22 క్యారెట్స్‌‌ కింద ఎక్కువగా గోల్డ్ నగలు అమ్ముడవుతున్నాయి. ఇటువంటి గోల్డ్‌‌ నగలను ప్రభుత్వం అనుమతి పొందిన అసెయింగ్‌‌ అండ్ హాల్‌‌మార్కింగ్ సెంటర్‌‌‌‌ (ఏహెచ్‌‌సీ) లు పరీక్షించి, ఈ నగలపై హాల్‌‌మార్కింగ్ ముద్రను వేస్తాయి. ఆ తర్వాత హాల్‌‌మార్కింగ్ సర్టిఫికెట్‌‌ను బీఐఎస్ ఇష్యూ చేస్తుంది.  ప్రస్తుతం 14, 18, 20, 22, 23, 24 క్యారెట్ల గోల్డ్ నగలపై హాల్‌‌మార్కింగ్ ముద్రను వేయడానికి అనుమతులు ఉన్నాయి.

రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో అమలు..

 ‘గోల్డ్ హాల్‌‌మార్కింగ్’ పాలసీని మొదటి దశ కింద మొత్తం 256 జిల్లాల్లో అమలు చేయగా, రోజుకి 3  లక్షలకు పైగా నగలపై హాల్‌‌మార్కింగ్ ముద్ర వేస్తున్నారని అంచనా. తెలంగాణలోని ఏడు జిల్లాలలో, ఆంధ్రప్రదేశ్‌‌లోని 12 జిల్లాలలో ఏఐహెచ్‌‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణలో అయితే హైదరాబాద్‌‌, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ అర్బన్‌‌, వరంగల్ రూరల్‌‌, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో గోల్డ్ నగలపై హాల్‌‌మార్కింగ్ వేస్తున్నారు. ఈ జిల్లాల్లో అమ్మే బంగారపు నగలపై కచ్చితంగా హాల్‌‌మార్కింగ్ ఉండాల్సిందే. హాల్‌‌మార్కింగ్‌‌ రూల్స్‌‌ను పాటించకపోతే జ్యువెలర్లు పెనాల్టీ కట్టాల్సిందే. దేశంలో చిన్న, పెద్ద కలిపి కొన్ని లక్షలకు పైగా జ్యువెలర్లు ఉన్నారు. వీరు కొత్త సిస్టమ్‌‌ కింద రిజిస్టర్ చేసుకోవడానికి టైమ్ పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. కొత్త సిస్టమ్‌‌ కింద మొదటి సారిగా రిజిస్టర్ చేసుకునే జ్యువెలర్లకు  రిజిస్ట్రేషన్ ఫీజును తొలగించింది.

వీటికి హాల్‌‌మార్కింగ్ అవసరం లేదు..

ఏడాదికి రూ. 40 లక్షల వరకు టర్నోవర్ ఉన్న జ్యువెలర్లు హాల్‌‌మార్కింగ్ రూల్స్‌‌ను పాటించాల్సిన అవసరం లేదు. వీరితో పాటు ప్రభుత్వ ట్రేడ్ పాలసీ బట్టి గోల్డ్‌‌ను ఎగుమతి చేసి, మళ్లీ దిగుమతి చేసుకునే వారు, విదేశాల్లో ప్రదర్శించే గోల్డ్ నగలపై హాల్‌‌మార్కింగ్ తప్పనిసరి కాదు. 

హాల్‌‌‌‌‌‌‌‌‌‌మార్కింగ్ ముఖ్యమే..

గోల్డ్‌‌‌‌ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇండియా ముందుంటుంది. మనదగ్గర పండగలకు, పెళ్లిళ్లకు, ఏదైనా ఈవెంట్‌‌‌‌ జరిగినా బంగారు నగలను వేసుకోవడం సాధారణం. కానీ, చాలా జ్యువెలర్లు గోల్డ్‌‌‌‌ను కల్తీ చేస్తున్నారు. ఇతర మెటల్స్‌‌‌‌తో ఈజీగా కలిసిపోయే గుణం గోల్డ్ సొంతం. దీంతో గోల్డ్‌‌‌‌ నగలను తయారు చేసేటప్పుడు ఇతర మెటల్స్‌‌‌‌ను వాడి, నగలలో గోల్డ్ పరిమాణాన్ని కొంత మంది జ్యువెలర్లు తగ్గిస్తున్నారు. కన్జూమర్లను మోసం చేస్తున్నారు. దీనిని అరికట్టడానికే ప్రభుత్వం గోల్డ్‌‌‌‌ హాల్‌‌‌‌మార్కింగ్ రూల్స్‌‌‌‌తో ముందుకొచ్చింది.  జ్యువెలర్లు నాణ్యమైన గోల్డ్ నగలనే అమ్ముతున్నారనే విషయాన్ని హాల్‌‌‌‌మార్కింగ్ సూచిస్తుంది. కన్జూమర్లు గోల్డ్‌‌‌‌ను మళ్లీ ఎవరికైనా అమ్మాలనుకున్నా సరియైన ధరను పొందడానికి వీలుంటుంది. హాల్‌‌‌‌మార్కింగ్ వలన కన్జూమర్లు కచ్చితంగా ఎన్ని క్యారెట్ల గోల్డ్‌‌‌‌కు డబ్బులు చెల్లిస్తున్నారో తెలుసుకోవచ్చు.