హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను విద్యాశాఖ వేగవంతం చేసింది. మంగళవారం1:3 రేషియో మెరిట్ లిస్టును ప్రకటించింది. 33 జిల్లాలకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) లిస్టులను విడుదల చేశారు. డీఈఓ ఆఫీసు నోటీస్ బోర్డులు, వెబ్ సైట్లలో పెట్టారు. దీంతోపాటు స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజీ పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించిన 1:3 మెరిట్ లిస్టులను బుధవారం రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బుధవారం నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. జిల్లాలోని పోస్టులకు అనుగుణంగా కేటగిరీ రోస్టర్ పాయింట్ల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులకు ఫోన్లకు ఎస్‌ఎంఎస్, ఈ -మెయిల్ ద్వారా సమాచారం అందించారు. మరోపక్క అభ్యర్థుల సౌకర్యార్థం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రొఫార్మానూ https://tgdsc.aptonline.in/tgdsc వెబ్ సైట్లో పొందుపర్చారు.