రైళ్లలో గంజాయి తరలింపు..ఇద్దరు అరెస్ట్

రైళ్లలో గంజాయి తరలింపు..ఇద్దరు అరెస్ట్
  • 11.20 లక్షల విలువైన 44 కిలోల సరుకు స్వాధీనం

సికింద్రాబాద్, వెలుగు : ఒడిశా నుంచి సిటీకి రైళ్లలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన శేషదేవ్ సేథీ(25), జగన్నాథ్ ప్రసాద్ నాయక్(24) భువనేశ్వర్ లో కిలో గంజాయిని రూ.3,500కు కొని దాన్ని రైళ్లలో సిటీకి తరలించి ఇక్కడ కిలో రూ.25 వేలకు అమ్ముతున్నారు. 6 నెలలుగా వీరిద్దరూ ఇదే విధంగా రైళ్లలో ఒడిశా నుంచి సిటీకి గంజాయిని తరలిస్తున్నారు. గంజాయి దందా గురించి సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిఘా పెట్టారు.

సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ కు వచ్చిన ఓ రైలు నుంచి ట్రాలీ బ్యాగ్ లతో శేషదేవ్, జగన్నాథ్ దిగారు. స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరున్న ట్రాలీ బ్యాగ్ లను తనిఖీ చేశారు. ఒక్కో బ్యాగ్ లో 22 కిలోల చొప్పున గంజాయిని గుర్తించారు. దీని విలువ సుమారు 11 లక్షల 20 వేలు ఉంటుందని అంచానా వేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.