సీఆర్పీఎఫ్​ కానిస్టేబుల్ వెపన్స్ బ్యాగ్​ రికవరీ

సీఆర్పీఎఫ్​ కానిస్టేబుల్ వెపన్స్ బ్యాగ్​ రికవరీ
  •     ఇద్దరిపై కేసు నమోదు 

సికింద్రాబాద్,వెలుగు : చోరీకి గురయిన మందు గుండు సామగ్రిని సికింద్రాబాద్​ రైల్వే పోలీసులు రికవరీ చేసి.. దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేశారు. రైల్వే ఇన్​స్పెక్టర్​ శ్రీను తెలిపిన ప్రకారం.. మంగళవారం సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్ ​ప్లాట్​ఫారం నంబరు 10 వద్ద పెట్టిన 60 ఇన్​సాస్​రౌండ్స్, మూడు మ్యాగజీన్లు,  వాటి పర్సు ఉన్న బ్యాక్​ప్యాక్ ​బ్యాగ్​ చోరీకి గురైనట్లుగా చాంద్రాయణగుట్ట జీడీ ఫోర్స్​ సీఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​సిద్ధార్ధ్​ సింగ్​ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.  జీఆర్​పీ, ఆర్పీఎఫ్​ పోలీసులు 8 టీమ్​లుగా ఏర్పడి రైల్వే స్టేషన్​తో పాటు  పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్​ను పరిశీలించారు. ఓ వ్యక్తి బ్యాగ్​తో వెళ్లడాన్ని ఫుటేజ్​లో గుర్తించి వెంటనే గాలింపు చేపట్టారు. బ్యాగ్​ను దొంగిలించిన వ్యక్తిని గాంధీనగర్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో పట్టుకుని విచారించారు.

అతడు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రాజం గ్రామానికి చెందిన నక్కేని ఆనందమూర్తి (21)గా గుర్తించారు. సిటీకి వచ్చిన ఆనందమూర్తి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడని, డబ్బుల కోసం చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. బ్యాగ్​ను గాంధీనగర్ ​మెట్రో స్టేషన్​ వద్ద వదిలిపెట్టినట్లు చెప్పాడు. పోలీసులు అక్కడకు వెళ్లగా.. బ్యాగు కనిపించకపోవడంతో మళ్లీ సీసీ కెమెరాల ఫుటేజ్​ను పరిశీలించారు. ఎరుపు రంగు దుస్తులు ధరించిన  65 ఏళ్ల వృద్ధుడు మార్నింగ్ వాక్​కు వెళ్లిన సమయంలో  రోడ్డు పక్కన పడి ఉన్న బ్యాగ్​ను తీసుకువెళ్లినట్లు గుర్తించారు.  

అతని ఆచూకీ తెలుసుకుని భోలక్​పూర్​లోని ఇంటికి వెళ్లిన పోలీసులు విచారించారు. రాచమల్ల సత్యనారాయణ(65)గా గుర్తించారు.  రోజు మాదిరిగానే మంగళవారం మార్నింగ్ వాక్​కు వెళ్లగా  రోడ్డు పక్కన ఉన్న బ్యాగ్​ను తీసుకువెళ్లినట్లు పోలీసులకు చెప్పారు. అతని వద్ద ఉన్న 60 ఇన్​సాన్​రౌండ్స్​, మూడు మ్యాగజీన్లతో పాటు మందుగుండు సామగ్రిని రికవరీ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్​స్పెక్టర్ శ్రీను తెలిపారు.