రైళ్లలో చోరీలు చేస్తున్న దొంగల అరెస్టు

రైళ్లలో చోరీలు చేస్తున్న దొంగల అరెస్టు
  •     రూ. 10 లక్షల విలువైన 67  సెల్‌‌‌‌ఫోన్లు,  ఒక ల్యాప్‌‌‌‌ టాప్‌‌‌‌ స్వాధీనం 

సికింద్రాబాద్​,వెలుగు : రైళ్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని సెల్‌‌‌‌ఫోన్లు దొంగిలిస్తున్న ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.10 లక్షలు విలువైన  67  సెల్‌‌‌‌ఫోన్లు,  ఒక ల్యాప్ టాప్‌‌‌‌,  రూ. 10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.  శనివారం రైల్వే ఎస్పీ షేక్‌‌‌‌ సలీమా మీడియాకు తెలిపిన ప్రకారం..  తుక్కుగూడలో ఉండే చైతన్య (26), అమీర్​పేట ఎల్లారెడ్డిగూడలో ఉండే మహ్మద్ రియాజ్ ​హుస్సేన్​(34)

 నాగారం రాంపల్లిలో ని మానిక్​ ప్రకాశ్ (22),  బంజారాహిల్స్ కు  చెందిన యోగి శంకర్ ​యాదవ్​(35),  మహారాష్ర్టకు చెందిన గణేశ్‌‌‌‌ దిలీప్‌‌‌‌ పాటిల్(42), కాటేదాన్‌‌‌‌లో ఉండే మాణిక్యం(44), అఫ్జల్​గంజ్‌‌‌‌కు చెందిన సురేంద్రసింగ్​ రాజ్‌‌‌‌పుత్​(26) లు ఈజీమనీ కోసం రైల్వే స్టేషన్లలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు.  చైతన్య , రియాజ్​హుస్సేన్, మాణిక్​ప్రకాశ్‌‌‌‌, యోగి శంకర్​యాదవ్‌‌‌‌  రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల నుంచి సెల్‌‌‌‌ఫోన్లు చోరీ చేసి వాటిని గణేశ్ దిలీప్‌‌‌‌ పాటిల్‌‌‌‌

నడికుడ మాణిక్యం, సురేందర్​సింగ్​ రాజ్​పుత్‌‌‌‌లకు ఇస్తారు.  ఈ ముగ్గురు వాటిని మహారాష్ట్ర, హైదరాబాద్​లో విక్రయిస్తుంటారు.  ఈనెల 10న సికింద్రాబాద్‌‌‌‌ రైల్వేస్టేషన్‌‌‌‌లో ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఓ ప్రయాణికుడు తన ల్యాప్ టాప్‌‌‌‌  బ్యాగును బెంచ్​పై పెట్టి నల్లా వద్ద ముఖం కడుక్కుంటుండగా బ్యాగును కొట్టేసి ఉడాయించారు. బాధితుడు  రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌‌‌‌లో  నిఘా పెంచారు.  

శనివారం  రైల్వే ఇన్‌‌‌‌స్పెక్టర్​ సాయి ఈశ్వర్​గౌడ్​, ఎస్​ఐలు ఎం. ఎ మాజీద్​, రమేశ్‌‌‌‌ ఇతర పోలీసులతో కలిసి ఒకటో నంబర్‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫారంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురుని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు.  అరెస్టు చేసిన ఆరుగురిని రైల్వే కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌‌‌‌కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు గణేశ్ దిలీప్‌‌‌‌ పాటిల్‌‌‌‌ కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ షేక్‌‌‌‌ సలీమా తెలిపారు.