
సికింద్రాబాద్, వెలుగు: స్కూల్‌కు సెల్‌ఫోన్ తీసుకెళ్లినందుకు పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేయడంతో మనస్తాపం చెందిన టెన్త్ క్లాస్ స్టూడెంట్ రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. సోమవారం సికింద్రాబాద్ పరిధిలోని ఆర్కేపురంలో ఈ విషాదం జరిగిందని రైల్వే పోలీసులు వివరాలు వెల్లడించారు. గాంధీనగర్‌లో ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రమణారెడ్డి కొడుకు దినేశ్‌రెడ్డి(15) ఏవోసీ సెంటర్లోని ఆర్మీ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. దినేశ్ సోమవారం స్కూల్‌కు సెల్‌ఫోన్ తీసుకువెళ్లగా.. అది గమనించి క్లాస్ టీచర్ వైస్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌కు చేరవేశారు. దీంతో ఆ ప్రిన్సిపాల్ దినేశ్ రెడ్డి తండ్రిని స్కూల్‌కు పిలిపించుకుని మందలించారు.
క్రమశిక్షణ ఉల్లంఘించడంతో దినేశ్‌ను 12 రోజుల పాటు సస్పెండ్ చేశారు. దీంతో తండ్రీకొడుకులు ఇద్దరూ స్కూల్ నుంచి బయటికి వచ్చారు. తనకు అర్జంట్ పనుందని.. దినేశ్‌ను ఇంటికి వెళ్లమని చెప్పి రమణారెడ్డి వెళ్లిపోయాడు. తన సైకిల్‌పై ఇంటికి బయల్దేరిన దినేశ్.. సస్పెండ్ చేయడాన్ని తట్టుకోలేకపోయాడు. అమ్ముగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకుని పట్టాల పక్కన తన సైకిల్‌ను పడేసి.. ఎదురుగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.