యువకుడికి ఊపిరితిత్తుల మార్పిడి

యువకుడికి ఊపిరితిత్తుల మార్పిడి
  • యువకుడికి ఊపిరితిత్తుల మార్పిడి
  • లంగ్స్​ ట్రాన్స్ ప్లాంట్​ను విజయవంతంగా  పూర్తి చేసిన యశోద హాస్పిటల్ డాక్టర్లు

సికింద్రాబాద్​, వెలుగు : ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడికి ఊపిరితిత్తుల మార్పిడితో సికింద్రాబాద్ యశోదా డాక్టర్లు కొత్త జీవితాన్నిచ్చారు. ఈ వివరాలను  శుక్రవారం యశోదా హాస్పిటల్స్ డాక్టర్లు మీడియాకు వివరించారు. మహబూబ్ నగర్ జిల్లా ముర్రాయిగూడెంనకు చెందిన రోహిత్(23) వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని కుటుంబసభ్యులు సికింద్రాబాద్​లోని యశోదా హాస్పిటల్​కు తీసుకొచ్చారు. పురుగుల మందు తాగడం వల్ల రోహిత్ ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింది.

అతడి లంగ్స్​లో విషకణాలు చేరడంతో పల్మనరీ ఫైబ్రోసిస్ ఏర్పడింది. రోహిత్ ప్రాణాలకు ప్రమాదం ఉండటంతో  యశోదా డాక్టర్లు వెంటనే అతడిని వెంటిలేటర్​పై  ఉంచి ట్రీట్​మెంట్ మొదలుపెట్టారు. లంగ్స్​ ట్రాన్స్ ప్లాంట్ చేయాలని నిర్ణయించారు. పూర్తిగా పాడైపోయిన రోహిత్ లంగ్స్ ను రీప్లేస్ చేసేందుకు జీవన్ దాన్​ను సంప్రదించారు. బ్రెయిన్ డెడ్ అయిన ఓ పేషెంట్ ఊపిరితిత్తులు రోహిత్​కు మ్యాచ్ కావడంతో వెంటనే అతడిని వాటికి అమర్చి ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తి చేశామని డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్ చేసిన రెండ్రోజుల్లోనే రోహిత్ కోలుకున్నాడన్నారు.

ఇలాంటి సందర్భంలో ఊపిరితిత్తుల మార్పిడి జరిగిన కేసులు ప్రపంచవ్యాప్తంగా 4 మాత్రమే ఉన్నాయని, అందులో ఎక్కువ కాలం జీవించి ఉన్న కేసు ఇదే మొదటిదన్నారు. దేశంలో ఇదే మొదటి ఆపరేషన్ అని తెలిపారు. ‘డబుల్ లంగ్ ట్రాన్స్​ ప్లాంటేషన్ ద్వారా రోహిత్​కు సరికొత్త జీవితాన్ని అందించామన్నారు. సమావేశంలో సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరికిషన్, డాక్టర్ కె. ఆర్. బాల సుబ్రహ్మణ్యం, డాక్టర్ మంజునాథ్ బాలే, డాక్టర్ చేతన్, డాక్టర్ శ్రీచరణ్, డాక్టర్ విమి వర్గస్తో పాల్గొన్నారు.