సికింద్రాబాద్‌‌‌‌ ఆల్ఫా హోటల్లో.. పాడైపోయిన మటన్‌‌‌‌, చికెన్‌‌‌‌తో బిర్యానీ

సికింద్రాబాద్‌‌‌‌ ఆల్ఫా హోటల్లో..   పాడైపోయిన మటన్‌‌‌‌, చికెన్‌‌‌‌తో బిర్యానీ

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌‌‌‌లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్​అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆయా హోటళ్లలో కుళ్లిపోయిన మటన్, చికెన్, అపరిశుభ్రంగా ఉన్న కిచెన్‌‌‌‌, కంపు కొడుతున్న పరిసరాలను గుర్తించి బుధవారం కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సికింద్రాబాద్‌‌‌‌లో ఆల్ఫా హోటల్‌‌‌‌ల్లో పాడైపోయిన మటన్‌‌‌‌తో బిర్యానీ చేసినట్లు గుర్తించారు. కిచెన్‌‌‌‌లో ఎలుకలు తిరుగుతుండటం, ఎలాంటి శుభ్రత లేకుండా ఉండటాన్ని గుర్తించారు. 

ఆల్ఫా హోటల్‌‌‌‌ బ్రాండ్ పేరుతో తయారు చేసిన బ్రెడ్‌‌‌‌, ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌, తదితర ఆహార పదార్థాలపై ఎక్స్‌‌‌‌పైరీ డేట్‌‌‌‌ లేకపోవడంతో సీజ్‌‌‌‌ చేశారు. అలాగే, సందర్శిని హోటల్, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్‌‌‌‌లో తనిఖీలు చేసిన అధికారులు.. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్​, వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్​వాడుతున్నట్లు గుర్తించారు. అనంతరం ఆయా హోటళ్ల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆల్ఫా హోటల్‌‌‌‌కు లక్ష రూపాయల జరిమానా విధించారు. కాగా, కుళ్లిన ఆహార పదార్థాలు వినియోగదారులు అందిస్తున్న ఆల్ఫా హోటల్‌‌‌‌పై గతేడాది జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులు దాడులు నిర్వహించి, జరిమానా కూడా విధించారు. 

వారం రోజులు హోటల్‌‌‌‌ను సీజ్‌‌‌‌ చేశారు. అనంతరం రెస్టారెంట్‌‌‌‌ను తిరిగి ప్రారంభం కాగా, మళ్లీ పాత పద్ధతిలోనే కార్యకలాపాలు సాగిస్తోంది. జీహెచ్‌‌‌‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం పర్యవేక్షణ లోపం వల్లే ఈ హోటళ్ల ఆటలు సాగుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పాడైన ఫుడ్‌‌‌‌ను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆల్ఫా హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. శుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లను ఏడాది పాటు సీజ్ చేయాలని కోరుతున్నారు.