
- గత నెల 24 నుంచి సమ్మర్ హాలిడేస్
- స్కూళ్లలో కంప్యూటర్లు, టీవీలు వంటి రూ.లక్షల విలువైన వస్తువులు
- బడుల్లో వాచ్ మ్యాన్లు లేక సెక్యూరిటీ కరువు
- సెలవులు వస్తే హెచ్ఎంలు భయపడే పరిస్థితి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడులకు భద్రత కరువైంది. స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వడంతో అటువైపు చూసే వాళ్లు లేరు. నైట్ వాచ్ మ్యాన్లు లేకపోవడంతో స్కూళ్లలోని విలువైన వస్తువులకు రక్షణ లేకుండా పోయింది. దీంతో హెడ్మాస్టర్లు, టీచర్లలో ఆందోళన మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల సర్కారు స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 4705 హైస్కూళ్లు, 3142 యూపీఎస్‌లు ఉండగా మిగిలినవి 18,254 ప్రైమరీ స్కూళ్లు. ఏప్రిల్ 24 నుంచి బడులకు వేసవి సెలవులు ఇచ్చారు. ప్రస్తుతం ఒక్కో హైస్కూల్ లో కనీసం రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల విలువైన వస్తువులు ఉన్నాయి. హాలిడేస్ ప్రారంభమైనప్పటి నుంచి బడుల్లోని వస్తువులకు భద్రత ఎలా అనే దానిపై విద్యా శాఖ అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
గతంలో అనేక స్కూళ్లలో విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. రెండేండ్ల క్రితం ‘మన ఊరు మన బడి’స్కీమ్ కింద ఒక నెలపాటు మాత్రమే వాచ్ మ్యాన్లను నియమించారు. గతేడాది నియమించలేదు. ఈ ఏడాది కూడా స్కూళ్లకు సెలవులు ఇచ్చి వారమైనా వాచ్ మ్యాన్ల నియామకంపై విద్యా శాఖలో ఎలాంటి చర్చ లేదు. కాపలాదారులు లేకపోవడంతో బడుల్లో దొంగతనాలతో పాటు అసాంఘిక కార్యక్రమాలూ జరుగుతున్నాయని హెడ్మాస్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపలాదారులు లేకపోవడంతో పోకిరీలు స్కూల్ ఆవరణలో మద్యం తాగి సీసాలను పగలగొట్టడం, క్లాస్ రూమ్ డోర్లను విరగొట్టిన సంఘటనలు గతంలో పలు బడుల్లో జరిగాయి.
బడుల్లో కంప్యూటర్లు, టీవీలు
ప్రస్తుతం దాదాపు ప్రతి స్కూల్లో కంప్యూటర్లు, టీవీలు, డిజిటల్ బోర్డులు ఉన్నాయి. పీఎంశ్రీ కింద ఎంపికైన బడుల్లో కొత్త కంప్యూటర్లు కూడా వచ్చాయి. లైబ్రరీ బుక్స్, సైన్స్ మెటీరియల్, రికార్డులు సహా విలువైన సర్టిఫికెట్లు బడుల్లోనే ఉన్నాయి. వీటితో ‘మన ఊరు మన బడి’కింద ఎంపికైన బడుల్లో విలువైన ఫర్నిచర్ ఉంది. దీంతో పాటు మిడ్డేమీల్స్ బియ్యం, వంటపాత్రలూ స్కూళ్లోనే ఉన్నాయి. గతంలో పలు బడుల్లో
దొంగలు, పోకిరీలు.. క్లాసురూంలు, ఆఫీసు రూమ్ ల డోర్లు పగలగొట్టి కొన్నింటిని దొంగతనం చేయగా, కొన్నింటిని నాశనం చేశారు. అయినా, వాటి భద్రతపై విద్యా శాఖ అధికారులు ఆలోచించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం బడుల భద్రతకు చర్యలు తీసుకోవాలని టీచర్లు, హెడ్మాస్టర్లు కోరుతున్నారు.
వాచ్‌మెన్‌ను నియమించాలి
బడుల్లోని విలువైన వస్తువుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ పూర్తయ్యే వరకైనా వాచ్ మ్యాన్లను నియమించాలి. సెలవులు వస్తే హెడ్మాస్టర్లు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. దొంగతనాలు జరిగితే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం శాశ్వాత ప్రాతిపదికన భద్రతా చర్యలు తీసుకోవాలి. - - రాజ్ గంగారెడ్డి, హెడ్మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు