- పీఎల్జీఏ బెటాలియన్2ను మట్టుబెట్టిన భద్రతాబలగాలు
- 18 మంది మావోయిస్టులు మృతి.. మృతుల్లో 9 మంది మహిళలు
భద్రాచలం, వెలుగు: ఎత్తయిన కొండల్లో ఏకంగా 23 గంటల పాటు భద్రతాబలగాలు నిర్వహించిన ఆపరేషన్ లో 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు డీఆర్జీ జవాన్లు సైతం చనిపోయారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కచిల్వార్-పోటేనార్ గ్రామ అడవుల్లో బుధ, గురువారాల్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ నంబర్2 బెటాలియన్మొత్తాన్ని భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.
ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి 18 మంది మావోయిస్టుల మృతదేహాలను, భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన డీఆర్జీ హెడ్‌కానిస్టేబుల్ మోనూ వడారి, కానిస్టేబుళ్లు రమేశ్ సోడి, దుకారు గోండిల మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు.
ఎన్కౌంటర్ మృతులు వీరే!
రెండు రోజుల పాటు గంగులూరు అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలను బస్తర్ ఐజీ సుందర్రాజ్, బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ గురువారం వెల్లడించారు. పీఎల్జీఏ బెటాలియన్ నంబర్2 ఇన్చార్జ్ మోడియం వెల్లా(45), కీలక నేతలు రేణు కుర్సం(40), సన్నూ అవలం(35), నందా మోడియం(35), లాలూ(32), రాజు పూనెం(29), కామేశ్ కవ్వాసి(33), లక్ష్మీ తాతి(22), బండి మండవి(30), సుక్కీ లోకాం(33), సోమ్డీ కుంజా(27), చందూ కుర్సం(25), మాసే అలియాస్ శాంతి(22), రీనా మర్కాం(26), సోనీ మడవి(20), సంగీత పదాం(21)ని గుర్తించారు. ఒక మహిళా, పురుష నక్సలైట్‌ను ఇంకా గుర్తించలేదు.
భారీగా ఆయుధాలు స్వాధీనం
ఎన్కౌంటర్ ప్రదేశాల నుంచి భద్రతాబలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎల్ఎంజీ 1, ఏకే-47లు 4, ఎస్ఎల్ఆర్లు 4, ఇన్సాస్ ఒకటి, 303 రైఫిల్స్ 2, సింగిల్ బోర్ రైఫిల్స్ 4, బీజీఎల్ లాంచర్లు 2, మజిల్ లోడింగ్ రేడియో ఒకటి, రేడియో, స్కానర్, మల్టీమీటర్, హ్యాండ్ గ్రేనెడ్, సేఫ్టీ ఫ్యూజ్, విప్లవసాహిత్యం, పోచ్, మెడికల్ కిట్స్, నిత్యావసర సరుకులు ప్రదర్శించారు.
