ఫ్రీడం ఫైటర్స్‌ను బెదిరించడానికి తెచ్చిన చట్టం అవసరమా?

ఫ్రీడం ఫైటర్స్‌ను బెదిరించడానికి తెచ్చిన చట్టం అవసరమా?

న్యూఢిల్లీ: మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీజీ, బాల గంగాధర్ తిలక్ లాంటి ఫ్రీడం ఫైటర్స్‌ను బెదిరించి కట్టడి చేసేందుకు బ్రిటిషర్లు తెచ్చిన రాజద్రోహం లేదా దేశ ద్రోహం సెక్షన్ 124(ఏ) చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ సెక్షన్ అవసరం ఇంకా ఏముందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. దీనిపై కేంద్రం కౌంటర్ వేయాలని ఆదేశించారు. రాజద్రోహం చట్టం విచ్చలవిడిగా దుర్వినియోగం అవుతోందని, దీని రద్దు చేయాలని కోరుతూ రిటైర్డ్ ఆర్మీ మేజర్ జనరల్ ఎస్‌జీ వోంబట్కెరె దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఫ్రీడం ఫైటర్స్‌ మాట్లాడే స్వేచ్ఛ, ప్రజల్లోకి వెళ్లే వీలు లేకుండా చేసి, స్వాతంత్ర్యోద్యమాన్ని అణిచివేసేందుకు బ్రిటిషర్లు ఉపయోగించిన ఈ చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదని అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను న్యాయమూర్తులు ప్రశ్నించారు. సెక్షన్ 124 (ఏ) అసాధారణంగా దుర్వినియోగమవుతోందని, జవాబుదారీతనం లేకుండా ప్రభుత్వాలు విచ్చలవిడిగా దీనిని వాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న కొయ్య ముక్క అవసరమైన చోట ఏకంగా అడవి మొత్తాన్నీ నరికేసే స్వేచ్ఛ ఇవ్వడం లాంటిదే సెడేషన్ యాక్ట్ అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ చట్టం వ్యాలిడిటీని పరిశీలించాల్సిందేనని చెప్పారు. అయితే చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం లేదని, కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేసి, సక్రమంగా ఉపయోగపడేలా ఆ చట్టాన్ని మార్చవచ్చని అటార్నీ జనరల్ వేణు గోపాల్ వాదనలు వినిపించారు. కానీ ఈ చట్టంలో అసలు రాజ్యాంగబద్ధత అనేదే లేదని, దీని రద్దు చేయాల్సిందేనని పిటిషనర్  ఎస్‌జీ వోంబట్కెరె వాదించారు.  ‘ప్రభుత్వం అనేక చట్టాలను రద్దు చేస్తోంది. ఈ చట్టంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదో తెలియడం లేదు. ఈ పిటిషన్‌ను ఎవరో ప్రేరేపించి వేయించినదిగా చూడలేం. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసేందుకు సిద్ధపడి సర్వీస్‌ చేసిన వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టంపై గతంలో నమోదై, వేర్వేరు బెంచ్‌ల పరిశీలనలో ఉన్నఅన్ని కేసులను కలిపి విచారిస్తాం’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చెప్పారు.