హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం ప్రకారం సీడ్ రైతులకు హక్కులు అందడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం బీఆర్‌కే భవన్‌లో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా తీర్చిదిద్దేందుకు రైతులు 60 రకాల విత్తనాలను పండిస్తున్నారని, అయితే 2007 కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం ప్రకారం రైతులకు హక్కులు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కరీంనగర్‌లో వరి సీడ్ రైతులకు ఎకరానికి రూ.75 వేలు ఇస్తుంటే, గద్వాలలో సీడ్ పత్తి రైతులకు పురుగు మందుల డబ్బులకు అడ్వాన్స్‌లు తీసుకొని, భూములు తనఖా పెట్టించుకుంటున్నారని, 250 గ్రాములు తరుగు కూడా తీసుకుంటున్నారని ఆరోపించారు.
గద్వాలలో 10 వేల మంది సీడ్ పత్తి రైతులకు ఆయా కంపెనీలు దాదాపు రూ.200 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్గనైజర్లు, మీడియేటర్లు రైతులను మోసం చేస్తున్నారని, చట్టంలోని లోపాలను సరిచేసి మంచి విత్తన చట్టం తీసుకురావాలని కోరారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.
