‘మా’ ఎన్నికలు: నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌పై నరేశ్ ఫైర్

‘మా’ ఎన్నికలు: నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌పై నరేశ్ ఫైర్

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై రగడ నడుస్తోంది. ‘మా’ ఎలెక్షన్స్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్‌తో మీడియా సమావేశం నిర్వహించడం, నాలుగేళ్లుగా ‘మా’ ప్రతిష్ట మసకబారిందని ప్రముఖ నటుడు నాగబాబు అనడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ‘మా’ ప్యానెల్ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ ప్రెస్ మీట్ పెట్టారు. ‘మా’ ఎన్నికలతోపాటు తాము చేసిన పనుల గురించి ఆయన మాట్లాడారు. నాగబాబు, ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై సీరియస్ అయిన నరేశ్.. ‘మా’ ప్రతిష్ట మసకబారిందనడం ముమ్మాటికీ తప్పన్నారు. లోకల్, నాన్‌ లోకల్ కామెంట్ల పైనా ఘాటుగా స్పందించారు. 

‘మా’ మసకబారిందనెలా అంటారు?
‘నేనేంటో ఎవరికీ చెప్పుకోనక్కర్లేదు. నేను సినిమా బిడ్డను, ‘మా’ బిడ్డను. సినీ పరిశ్రమకు ఎటువంటి సమస్య వచ్చినా నేను, మా కుటుంబం అండగా ఉండి నిలబడ్డాం. కాబట్టి నరేశ్ మమ్మల్ని కలుపుకు పోలేదనడం ఎంతవరకు నిజమనేది అందరూ ప్రశ్నించుకోవాలి. ఇక, ‘మా‘ ఎన్నికల విషయానికొస్తే.. తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు మూడ్నెళ్ల కింద ప్రకాశ్ రాజ్ చెప్పాడు. ‘మా’ రూల్స్ ప్రకారం ఎన్నికల్లో ఎవ్వరైనా పోటీ చేయొచ్చని ఆయనకు చెప్పా. మంచు విష్ణు కూడా నన్ను సంప్రదించాడు. ఎవ్వరైనా పోటీ చేయొచ్చని ఆయనకూ చెప్పా. ‘మా’ ఓ రాజకీయ వ్యవస్థ కాదు. ఎంతో మంది పెద్దలు ఈ సంస్థను నిర్మించారు. ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్‌‌తో మేము చాలా బాధపడ్డాం. నాగబాబు ‘మా’ మసకబారిందనడం తప్పు. ‘మా’ మసకబారిందా, ముందుకెళ్లిందా అనేది వాళ్లే తెలుసుకోవాలి. ఇప్పటికీ ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలనే కోరుకుంటున్నాం’ అని నరేశ్ స్పష్టం చేశారు. 

‘మా’ను కూల్చడం ఎవ్వరితరం కాదు
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో మొత్తం 914 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ మెడికల్ ఇన్సూరెన్స్ చేశాం. రూ.వెయ్యిగా ఉన్న పెన్షన్‌ను ఆరు వేలకు పెంచాం. కరోనా టైమ్‌లోనూ ‘మా’లో 87 మంది కొత్త సభ్యులు చేరారు. కల్యాణ లక్ష్మి, పింఛన్లు, ఆరోగ్యం కోసం చాలా కార్యక్రమాలు చేశాం. కొంత మంది ఆర్టిస్టులకు అవకాశాలు కూడా ఇప్పించాం. మేం ఇన్ని పనులు చేసినా ‘మా’ మసకబారిందంటున్నారు. ‘మా’ క్రమశిక్షణ సంఘం నన్ను రిజైన్ చేయమంటే ఇప్పుడే చేస్తా. మేం ఏమీ చేయలేదని అంటూ మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నారు? మేం హింసకు లొంగం. ఈసారి మహిళలకు చాన్స్ ఇవ్వాలని క్రమశిక్షణా సంఘానికి సిఫార్సు చేశాం. ‘మా’ ఓ దిగ్గజం. దీన్ని కూల్చడం ఎవ్వరి వల్ల కాదని కృష్ణంరాజు అందరికీ చెప్పమన్నారు. ‘మా’ భవనం కోసం సీఎం కేసీఆర్‌ను కలిశాం. ఆయన తమ వంతు సాయం చేస్తామన్నారు. ఇక్కడ ప్రాణాలు గిల గిల కొట్టుకుంటుంటే మీరు ప్యానెల్‌ను ప్రకటిస్తారా’ అని ప్రకాశ్ రాజ్‌పై నరేశ్ ఫైర్ అయ్యారు. 

మా ప్యానెల్ మద్దతు మహిళలకే
‘మా’ కుర్చీ మీద అంత మమకారం ఎందుకని నటి, ప్రస్తుత ‘మా’ ప్యానెల్‌లో సభ్యురాలు కరాటే కల్యాణి ప్రశ్నిచారు. మద్రాస్ వెళ్లి అక్కడ కుర్చీ ఇమ్మంటే ఇస్తారా అని క్వశ్చన్ చేశారు. మహిళలకు అవకాశం ఇస్తే తాము సపోర్టు చేస్తామన్నారు. ‘మా’ కోసం చాలా కష్టపడి పని చేశామని, అయినా ఏం చేయలేదని అంటుంటే బాధగా ఉందని నటుడు, ‘మా’ ప్యానెల్ సభ్యుడు శివ బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్యానెల్‌కు ఇంకా రెండు నెలల టైమ్ ఉందని, ఈ సమయంలో తాము చేయాల్సినవి ఎన్నో ఉన్నాయని చెప్పారు.