రిపోర్ట్ కార్డ్ ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు

V6 Velugu Posted on Oct 16, 2021

మంచి ప్యానెల్ కావాలా? మంచు ప్యానెల్ కావాలా? అన్న ప్రకాష్ రాజ్ ప్రచార వ్యాఖ్యలకు నరేష్ ఇన్‎డైరెక్టుగా కౌంటర్ ఇచ్చారు. రిపోర్ట్ కార్డ్ ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని, కావలసిన వాళ్లు వెబ్ సైట్ లో చూసుకోవాలని నరేష్ అన్నారు. ‘మా’ కోసం మంచి మంచు ప్యానెల్ వచ్చిందని నరేష్ అన్నారు. మంచి మెంబెర్, మంచి మ్యానిఫెస్టోతో విష్ణు మనందరి ముందుకు వచ్చారని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారని.. అదంతా అప్పటివరకేనని.. ఇకనుంచి అందరం కలిసి ఉందామని నరేష్ పేర్కొన్నారు. ‘మా’ అధ్యక్షుడిగా విష్ణుతో పాటు ప్యానెల్ మెంబర్స్ అందరూ ఫిల్మ్ చాంబర్‎లో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు నరేష్ పైవిధంగా వ్యాఖ్యానించారు.

‘మంచి మైక్‎లో చెప్పాలి. చెడు చెవులో చెప్పాలి. మంచు కమిటీ మంచి కమిటీ. అనుభవం కలవారు, యువత, మహిళలకు పెద్ద పీట వేశారు. అందుకే ఇది మంచి కమిటీ. మంచు విష్ణు అద్భుతమైన మేనిఫెస్టో ప్రకటించారు. ‘మా’ ఎప్పుడు కూడా ఏ ఒక్కరి సొత్తు కాదు. కోహినూర్ డైమండ్ పెద్దదా చిన్నదా అన్నది కాదు.. దాని విలువే వేరు. ‘మా’ కూడా అంతే. నేను ఖచ్చితంగా ‘మా’ను అంటిపెట్టుకుని ఉంటాను. ఒక మేనిఫెస్టో నేను పూర్తి చేశాను అని ఎవరినైనా చెప్పమనండి. మంచు విష్ణు మేనిఫెస్టో మాత్రం పూర్తి అవుతుంది. రిపోర్ట్ కార్డ్ ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ‘మా’ చేసిన పనుల గురించి వెబ్‎సైట్‎లో ఉంటుంది. కావలసిన వారు చూసుకోవచ్చు. మీకు ఏదైనా ఫిర్యాదు ఉంటే ఫిర్యాదు బాక్స్‎లలో వేయండి.. మేం చూస్తాం. ఆరేళ్ళ నా పనికి ఓ మంచి భవిష్యత్తు రాబోతుంది’ అని నరేష్ అన్నారు.

Tagged mohanbabu, tollywood, Manchu Vishnu, prakashraj, Senior actor Naresh, Maa Elections

Latest Videos

Subscribe Now

More News