
‘మా’ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహరావు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. నిన్న విష్ణు తన ప్యానెల్‌తో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నరేష్ మాట్లాడుతూ ‘కొంతమంది మీడియా ముందు ఏవేవో అబద్ధాలు చెప్పేస్తున్నారు. వాళ్లు అంటున్నట్టు ‘మా’ మసకబారలేదు. నేను ఇరవయ్యేళ్ల పాటు సభ్యుడిగా ఉన్నాను. జాయింట్ సెక్రెటరీగా చేశాను. ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా చేయమన్నా చేస్తాను. ఇక్కడ స్థాయి అంటూ ఏముంది! నేను వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు అందరికీ అవకాశాలు కల్పించాం. ఆరోగ్యం, పెన్షన్స్ వంటి వాటిపై దృష్టి పెట్టాం. కరోనా సమయంలోనూ సాయం చేశాం. ఈ మూడేళ్లలో ‘మా’ ముందుకు పోయిందే కానీ మసకబారలేదు. మాకెవరికీ పదవీ వ్యామోహం లేదు. ‘మా’ అనేది రాజకీయ వేదిక కాదు. ‘మా’ అధ్యక్షుడిగా ఒక తెలుగువాడే ఉండాలి. ఎవరు పడితే వాళ్లొచ్చి కూర్చుంటే ‘మా’ మసకబారడం కాదు, అదో మచ్చలా మిగిలిపోద్ది. ప్రకాష్‌రాజ్‌ని నేను అడుగుతున్నా. మీరెప్పుడైనా ‘మా’ సమావేశాల్లో పాల్గొన్నారా? ఎన్నికల్లో ఓటు వేశారా? ఎప్పుడైనా ఏ సభ్యుడికైనా ఫోన్ చేసి కనీసం బర్త్ డే విషెస్ చెప్పారా? మరి ఇప్పుడెందుకొచ్చింది మా మీద ఇంత ప్రేమ? అసలీ పోటీలోకి మీ అంతట మీరే వచ్చారా లేక ఎవరైనా తీసుకొచ్చారా? నా తర్వాత ‘మా’కి మరో మంచి అధ్యక్షుణ్ని అందించడం నా బాధ్యత. అందుకే నేను విష్ణుకు మద్దతు ఇస్తున్నాను. తనీ పదవికి తగిన వ్యక్తి. నేను విష్ణు రథం ఎక్కుతున్నాను. తను గెలిచినా ఓడినా మేమంతా ‘మా’ సభ్యులమే’ అన్నారు.