నిర్మలా సీతారామన్ ఫొటోతో.. వృద్ధుడి నుంచి 14 లక్షలు కొట్టేశారు.. పెట్టుబడి లాభాల పేరిట సైబర్ ఫ్రాడ్

నిర్మలా సీతారామన్ ఫొటోతో.. వృద్ధుడి నుంచి 14 లక్షలు కొట్టేశారు.. పెట్టుబడి లాభాల పేరిట సైబర్ ఫ్రాడ్

బషీర్​బాగ్​,వెలుగు: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ఫొటో ఉపయోగించిన స్కామర్స్ సిటీకి చెందిన ఓ వృద్ధుడి నుంచి రూ. 14 లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి కథనం ప్రకారం.. సంతోష్ నగర్ కు చెందిన 68 ఏళ్ల వృద్ధుడు జూన్ లో ఫేస్ బుక్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటో ఉన్న యాడ్ చూశాడు. ఆన్​లైన్​ఇన్వెస్ట్​మెంట్​ చేస్తే అధిక లాభాలు వస్తాయంటూ ఆ యాడ్ లో స్కామర్స్​పేర్కొన్నారు. ఇది నిజమని నమ్మిన వృద్ధుడు అక్కడున్న లింక్ పై క్లిక్ చేశాడు. తర్వాత యూకే లోని క్వాటమ్ ఏఐ కంపెనీ ఎంప్లాయ్ అంటూ ఓ వ్యక్తి వాట్సాప్ కాల్ చేశాడు.

మెటల్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయాలని కోరగా, మొదట బాధితుడు రూ.12,600 పెట్టుబడి పెట్టాడు. తర్వాత స్కామర్స్ అధిక లాభాలు ఆశ చూపిస్తూ పలు దఫాలుగా రూ. 14,35,461 ఇన్వెస్ట్ చేయించారు. దీనికి రూ. 36 లక్షలు లాభాలు వచ్చినట్లు చూపించారు. బాధితుడు ఆ డబ్బులను విత్ డ్రా చేసుకోవాలంటే , మరో రూ.8 లక్షలను ఆదాయపు పన్నుగా చెల్లించాలని సూచించారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.