మోడీ, అమిత్ షాలను కొట్టే సమయం వచ్చింది

మోడీ, అమిత్ షాలను కొట్టే సమయం వచ్చింది

పెగసాస్ స్పైవేర్ వల్ల పార్లమెంట్‌లో అలజడిరేగుతోంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.  ఫోన్ల హ్యాకింగ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా గురువారం నిరసనలకు దిగింది. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాజస్థాన్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. పెగసాస్ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని.. రాజస్థాన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు దుంగార్పూర్ ఎమ్మెల్యే గణేష్ ఘోగ్రా తీవ్రపదజాలంతో మాట్లాడారు. మోడీ, అమిత్ షాలను కొట్టే సమయం వచ్చిందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

‘మన గవర్నర్ భారతీయ జనతా పార్టీకి చెందిన దలాల్‌గా మారాడు. కాంగ్రెస్ నాయకులు దేశంలోని సామాన్య ప్రజల పక్షాల నిలబడి ఉన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, ద్రవ్యోల్బణం, డీజిల్, పెట్రోల్ ధరలతో సామాన్యుడి నడ్డి విరిచి మనల్ని మళ్లీ బానిసలుగా చేస్తున్నారు. పెగసాస్ ద్వారా లీడర్ల వ్యక్తిగత చర్చలు వింటున్నారు. ఇటువంటి చెడ్డ పని ఎవరు చేస్తారా? పీఎం మోడీ, అమిత్ షాలను ఉరికించి కొట్టాలి’ అని ఎమ్మెల్యే గణేష్ ఘోగ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోడీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ 2017లో ఒక అవమానకరమైన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ‘ఆర్ట్ ఆఫ్ ఫూలింగ్’లో ప్రధాని మోడీ బెస్ట్ అని అన్నారు. అదేవిధంగా 2018లో తిరువనంతపురం ఎంపీ శశి థరూర్.. పీఎం మోడీని తేలుతో పోల్చాడు. ‘మోడీ శివలింగం మీద కూర్చున్న తేలు లాంటివాడు. మీరు అతన్ని మీ చేతితో తీసేయలేరు.. అలా అని దానిని చెప్పుతో కొట్టలేరు’ అని శశి థరూర్ అన్నారు.