తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుంది. ప్రముఖ దర్శకుడు, సీనియర్ జర్నలిస్ట్ బండి రఘరామ్ ( 56) కన్నుమూశారు. హైదరాబాద్ మధురానగర్ లో నివాసముంటున్న ఆయన.. మంగళవారం ( ఏప్రిల్ 28, 2026 ) వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతోఅక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే బంధువులు, సన్నిహితులు ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సినిమాపై మక్కువతో..
జగిత్యాల జిల్లాకు చెందిన బండి రఘురామ్ కేవలం సినీ దర్శకుడే కాదు. జర్నలిజంలో ఎం.ఫిల్, ఇంగ్లీష్ లిటరేచర్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. లిబియన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన, సినిమాలపై ఉన్న మక్కువతో ఆ ఉద్యోగాన్ని వదిలి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ప్రముఖ దర్శకుడు సానా యాదిరెడ్డి వద్ద 'పిట్టలదొర', 'బ్రహ్మచారి' వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో-డైరెక్టర్‌గా పనిచేసి దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నారు.
దర్శకుడిగా ‘వరం’
2004లో శివాజీ, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వరం’ చిత్రంతో రఘురామ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, దర్శకుడిగా ఆయన ప్రతిభను చాటుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలకు రైటర్‌గా, ఘోస్ట్ రైటర్‌గా తన సేవలను అందించారు. ఇటీవల మళ్ళీ మెగాఫోన్ పట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ, స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న తరుణంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
జర్నలిజంలోనూ తనదైన ముద్ర
సినిమాల్లోకి రాకముందు, వచ్చాక కూడా రఘురామ్ జర్నలిజం రంగంలో చురుగ్గా ఉండేవారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఈటీవీ, వీ6 వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో స్పెషల్ కరస్పాండెంట్‌గా పనిచేశారు. ముఖ్యంగా ఆయన ఇచ్చే సినిమా రివ్యూలకు, విశ్లేషణలకు పాఠకుల్లో మంచి గుర్తింపు ఉండేది. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు, జర్నలిస్ట్ మిత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రఘురామ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒకేసారి అటు సినీ రంగంలో, ఇటు మీడియా రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

