రాహుల్ గాంధీ మంచి వ్యక్తే కానీ..లీడర్ కాదు

రాహుల్ గాంధీ మంచి వ్యక్తే కానీ..లీడర్ కాదు

కాంగ్రెస్ పార్టీని తాను బలవంతంగా వీడాల్సి వచ్చిందని సీనియర్ లీడర్ గులాం నబీ ఆజాద్ అన్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన తర్వాత తొలిసారి స్పందించిన ఆయన..పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం కొరవడిందని చెప్పారు. జీ23 నేతలతో కలిసి తాను  అధిష్టానానికి లేఖ రాసినప్పటి నుంచే తనను టార్గెట్ చేశారని తెలిపారు. ఎన్నోసార్లు కాంగ్రెస్ సమావేశాలు జరిగాయని..అయితే తానిచ్చిన ఏ సలహాను కూడా తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. అందుకే తట్టుకోలేక ఆ లేఖ రాసినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు మాత్రం తన రాజీనామాకు ప్రధాని మోడీని సాకుగా చూపుతున్నారని చెప్పారు. 

పార్టీని వీడాలని ఎప్పుడూ అనుకోలేదు..
జీ23 నేతలతో కలిసి తాను పార్టీ అధిష్టానానికి లేఖ రాసిన తర్వాత  నిద్రలేని రాత్రులు గడిపానని గులాంనబీ ఆజాద్ తెలిపారు. అయితే ఎప్పుడూ కూడా పార్టీకి రాజీనామా చేయాలని అనుకోలేదన్నాడు.  కానీ తన ఇంట్లో నుంచి తననే బలవంతంగా వెళ్లిపోయేలా చేశారని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకత్వానికి లోపాలను సరిదిద్దుకునే సమయం లేదన్న గులాం నబీ... ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నవారంతా పనికిరానివారని మండిపడ్డారు. రాష్ట్రాల అధ్యక్షులు కాంగ్రెస్ సభ్యులను ఏకం చేయాల్సింది పోయి.. ఇతరను పార్టీని వీడేలా చేస్తున్నారని ఆరోపించారు.  మూలుగుతున్న కాంగ్రెస్కు.. డాక్టర్ నుంచి కాకుండా కంపౌండర్ నుంచి మందులు అందుతున్నాయని ఎద్దేవా చేశారు. 

రాహుల్ గాంధీ మంచి వ్యక్తే..కానీ..
కాంగ్రెస్ పార్టీ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  30 ఏళ్ల క్రితం సోనియా గాంధీపై ఎలాంటి గౌరవం ఉందో ఇప్పుడు కూడా ఆమె అంటే తమకు గౌరవమని చెప్పారు. ఇందిరాగాంధీ కుటుంబ వారసుడిగా.. రాజీవ్ -సోనియా కుమారుడిగా రాహుల్ ను కూడా తాము గౌరవిస్తున్నామన్నారు. అయితే రాహుల్ ను సక్సెస్ ఫుల్ లీడర్ గా  చేయాలని అనుకున్నామని.. కానీ ఆయన ఆసక్తి చూపించలేదన్నాడు. రాహుల్ గాంధీ మంచి వ్యక్తే కానీ.., రాజకీయ నాయకుడు కాదని ఆజాద్ చెప్పాడు. 

మోడీపై ప్రశంసలు..
ప్రధాని నరేంద్ర మోడీపై ఆజాద్  ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ చాలా కఠినమైన మనిషి అని మొదట అభిప్రాయపడ్డానని చెప్పారు.  కానీ  మోడీ మానవతావాది అని మెచ్చుకున్నారు. బీజేపీలో చేరే ప్రసక్తే లేదన్న ఆయన.. ఆ నిర్ణయం జమ్మూకాశ్మీర్‌లో తన రాజకీయాలకు ఏ మాత్రం ఉపయోగపడదన్నారు.