నోటిఫికేషన్లు నిల్.. హెచ్‌ఎండీఏలో రిటైర్డ్ ఉద్యోగులకే జాబ్స్‌

నోటిఫికేషన్లు నిల్.. హెచ్‌ఎండీఏలో రిటైర్డ్ ఉద్యోగులకే జాబ్స్‌
  • యువతకు నోటిఫికేషన్లు లేవ్.. సీనియర్ సిటిజన్లు ఎక్స్‌టెన్షన్లు

తెలంగాణ  వస్తే.. నిరుద్యోగులకు  ఉద్యోగాలొస్తయ్  అనుకున్నారు. కానీ  సర్కార్ ...జాబ్ నోటిఫికేషన్లు  వేయకపోవడంతో  నిరుద్యోగులు  ఆత్మహత్యలకు  పాల్పడుతున్నారు. అయితే ప్రభుత్వ శాఖల్లో  వేల సంఖ్యలో ఖాళీలున్నా.. రిటైర్డ్  ఉద్యోగులే  ఏళ్ల తరబడిగా కొనసాగుతున్నారు.  లక్షల్లో  జీతం,  ఖరీదైన  కార్లలో  దర్జాగా  తిరుగుతున్నారు.  రాష్ట్రంలోని హెచ్ఎండీఏ మొత్తం  రిటైర్డ్  ఉద్యోగులతో  నిండిపోయింది. 

రాష్ట్రం ఏర్పడితే.. ఇంటికో ఉద్యోగం అన్నారు సీఎం కేసిఆర్. ఆ మాట నమ్మిన నిరుద్యోగులు కొలువులు వస్తాయని  ఆశ పడ్డారు.  కానీ సర్కార్ జాబ్ నోటిఫికేషన్లు వేయట్లేదు. అయితే హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)లో ఉద్యోగాల భర్తీ కాకపోవడంతో.. వివిధ శాఖల్లో రిటైర్డ్ అయిన ఉద్యోగులు పైరవీలు చేయించుకొని వచ్చి పదవుల్లో కూర్చుంటున్నారు. హెచ్ఎండీఏలోనే రిటైర్డ్ అయిన వాళ్లు కూడా ఎప్పటికప్పుడు ఎక్స్ టెన్షన్ తెచ్చుకుంటూ కంటిన్యూ అవుతున్నారు. దీంతో హెచ్ఎండీఏ సీనియర్ సిటిజన్లకు అడ్డాగా మారింది.

హెచ్ఎండీఏలో ఉన్నతస్థాయి పోస్టుల్లో అంతా సీనియర్ సిటిజన్లే ఉద్యోగాలు చేస్తున్నారు. మొత్తం వెయ్యి మంది ఉద్యోగులు ఉండాలి. ప్రస్తుతం 148 మాత్రమే పనిచేస్తున్నారు. వాళ్లల్లో సగం మంది 60 నుంచి 80 ఏళ్ల వాళ్లే. వీళ్లంతా వివిధ శాఖల్లో రిటైర్డ్ అయ్యారు. వాళ్లకి తెలిసిన వాళ్లతో లాబీయింగ్  చేసి.. హెచ్ఎండీఏలో ఉద్యోగం తెచ్చుకున్నారు. ఇందులో కొందరు ఐదు నుంచి పదేళ్లుగా పనిచేస్తున్న వాళ్లుంటే.. మరికొందరు నాలుగైదు ఏళ్లుగా వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు. వీళ్లని చూసి.. రిటైర్‌‌మెంట్‌కు దగ్గరగా ఉన్న మిగిలిన వాళ్లు కూడా ఎక్స్ టెన్సన్ తెచ్చుకుంటూ లాబీయింగ్ చేస్తున్నారు.

రిటైర్డ్ అయ్యాక కృష్ణా.... రామా అనుకోవాల్సిన వాళ్ళంతా... లాబీంగ్ చేసి  హెచ్‌ఎండీఏలో మకాం వేశారు. ఓ ఉన్నత పదవిలో ఉన్న ఓ వ్యక్తి అయితే.. ఇప్పటికీ రెండుసార్లు ఎక్స్ టెన్షన్ తెచ్చుకున్నారు. ఈయనే కాదు.. ఇంజనీరింగ్, ప్లానింగ్, రెవెన్యూ, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లోనూ వంద మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి నెలా వీళ్లకు లక్షల్లో జీతం, కారు, టెలిఫోన్ సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోంది. 

ఏపీ ట్రాన్స్‌కోలో పని చేసి రిటైర్‌‌ అయిన అధికారికి..

హెచ్‌ఎండీఏలో ఉన్నత పదవుల్లో కొనసాగుతున్న ఓ ఇంజనీరింగ్ అధికారి 61 ఏళ్లకు రిటైర్ అయినా.. మరో రెండేళ్ల పొడగింపు కోసం ట్రై చేస్తున్నారు. అదే ఇంజనీరింగ్ విభాగంలో రిటైర్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. ఏపీ ట్రాన్స్ కోలో పనిచేసి 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిన అధికారికి కూడా మన సర్కార్ ఇక్కడ ప్లేస్ మెంట్ కల్పించింది.  70 ఏళ్లకు పైబడిన వ్యక్తులు కూడా హెచ్‌ఎండీఏలో పనిచేస్తూ.. 80 వేల జీతం, కారు, ఫోన్ సౌకర్యం పొందుతున్నారు.  70 ఏళ్లు పైబడిన ఓ రిటైర్డ్ ఆఫీసర్... 8 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. లక్షకు పైగా జీతం, వాహనం, టెలిఫోన్ ఫెసిలిటీ, ఛాంబర్ సౌకర్యం కల్పించారు. హెచ్‌ఎండీఏలో  కింది స్థాయిలోనూ చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులే పనిచేస్తున్నారు. 

నెలకు రెండు లక్షల జీతం, కారు..

ఇంకో అధికారి అయితే... నార్త్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యి... పైరవీ చేయించుకొని హెచ్‌ఎండీఏకు వచ్చారు.  నెలకు రెండు లక్షల జీతం, వెహికిల్ తో ఇతర సౌకర్యాలు కూడా కల్పించింది తెలంగాణ సర్కార్. అయితే ఈ సెక్షన్ లో కింది స్థాయి సిబ్బంది అంతా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్సే. వాళ్ల జీతాలు మాత్రం15వేల లోపే ఉన్నాయి. హెచ్‌ఎండీఏ ఎస్టాబ్లిష్, ప్లానింగ్ విభాగంలోనూ చాలా మంది సీనియర్ సిటిజన్లు పని చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో రిటైర్ అయిన వాళ్లు కూడా హెచ్‌ఎండీఏలో ఉన్నత పదవుల్లో కంటిన్యూ అవుతున్నారు. 10మంది వరకు రిటైర్ తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్ లు ప్లానింగ్ సెక్షన్ లో ఉన్నారు. వీళ్లకి ఒక్కొక్కరికి 30 నుంచి 50వేల దాకా శాలరీలు చెల్లిస్తోంది హెచ్‌ఎండీఏ.

సగం మంది సీనియర్ సిటిజన్లే

హెచ్‌ఎండీఏలోని అర్భన్ ఫారెస్ట్, అడ్మినిస్ట్రేషన్, మెయింటెనెన్స్ , పీపీపీ, ఈఎంయూ సెక్షన్, ఆర్టీఐ విభాగం, అకౌంట్స్, ఇంజనీరింగ్ డెవలప్ మెంట్ సెక్షన్.. ఇలా చెప్పుకుంటూపోతే హెచ్‌ఎండీఏలో సగం మంది సీనియర్ సిటీజన్లే ఉన్నారు. వీళ్లంతా కిందిస్థాయి ఉద్యోగులపై ఆధారపడి హడావిడి చేయడం తప్ప.. పని చేసేదేమీ ఉండదంటున్నారు రెగ్యులర్ ఎంప్లాయీస్.