ఒక్క రోజే రూ.9 లక్షల కోట్ల నష్టం

ఒక్క రోజే రూ.9 లక్షల కోట్ల నష్టం
  • సోమవారం ఒక్క రోజే రూ.9 లక్షల కోట్ల నష్టం
  • 1,546 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్‌,  నిఫ్టీ 468 పాయింట్లు డౌన్‌

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌, వెలుగు:  మార్కెట్ల పతనం సోమవారం  కూడా కొనసాగింది. యూఎస్‌‌ ఫెడ్ మీటింగ్‌‌ మంగళవారం స్టార్ట్​ కానుంది. ఈ మీటింగ్‌‌కు ముందు గ్లోబల్‌‌ మార్కెట్లతో పాటే మన మార్కెట్లు భారీగా నష్టపోయాయి. వడ్డీ రేట్లను ఇప్పుడు  పెంచకపోయినా, బాండ్ కొనుగోళ్లను ఫెడ్ నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో  ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు.  సోమవారం సెషన్‌‌లో  బెంచ్‌‌ మార్క్ ఇండెక్స్‌‌లయిన సెన్సెక్స్‌‌, నిఫ్టీలు 3 శాతం మేర పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 9 లక్షల కోట్లు నష్టపోయారు. కాగా,  యూఎస్ ఫెడ్‌‌  మీటింగ్ 25 న స్టార్టయ్యి, 26 న ముగుస్తుంది. ఫెడ్ న్యూస్‌‌తో పాటు రష్యా–యుక్రేయిన్‌ గొడవ, మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెళ్లిపోతుండడం..ఇండెక్స్‌‌లు మరింత పడడానికి కారణమవుతున్నాయి. యూఎస్ టెక్‌‌ షేర్లు నష్టపోతుండడంతో మన టెక్ షేర్లు కూడా పడుతున్నాయి. సెన్సెక్స్ సోమవారం 1,546 పాయింట్లు (2.62 %) నష్టపోయి 57,492  వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 468 పాయింట్లు (2.66 %)  తగ్గి  17,149 వద్ద ముగిసింది. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్‌‌ 3,820 పాయింట్లు పతనమయ్యింది. నిఫ్టీ  1,100 పాయింట్లు తగ్గింది.  కిందటేడాది అక్టోబర్‌‌‌‌  లెవెల్స్‌‌ నుంచి  చూస్తే బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు 6 % మేర నష్టపోయాయి. ఈ 5 సెషన్లలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.19.33 లక్షల కోట్లు తగ్గింది. నిఫ్టీలో సిప్లా, ఓఎన్‌‌జీసీ తప్ప మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ముగిశాయి. 

రానున్న సెషన్‌‌లు  ఎలా ఉండొచ్చు..

‘నిఫ్టీ ప్రస్తుత లెవెల్‌‌ నుంచి ఇంకో 500 పాయింట్లు పడొచ్చు. మరోవైపు బడ్జెట్ ముందు స్టాక్ మార్కెట్‌‌లో హెల్తీ కరెక్షన్ వచ్చింది’ అని యెస్ సెక్యూరిటీస్‌‌ ఎనలిస్ట్‌‌ అమర్‌‌‌‌ అంబానీ పేర్కొన్నారు.  ఇప్పటి వరకు కార్పొరేట్‌‌ కంపెనీల రిజల్ట్స్‌‌ పాజిటివ్‌‌గా ఉన్నాయని, ఎకానమీపై ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉందని పేర్కొన్నారు. కిందటేడాది కంటే ఈ ఏడాది మార్కెట్‌‌ ఎక్కువగా పెరుగుతుందని అంచనావేశారు. 
‘ఫెడ్‌‌ మీటింగ్‌‌కు ముందు గ్లోబల్‌‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.  మార్కెట్‌‌లో లిస్టింగ్ అయిన కొత్త తరం టెక్నాలజీ కంపెనీల షేర్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. ఎఫ్‌‌ఐఐ ఓనర్‌‌‌‌షిప్ ఎక్కువగా ఉన్న షేర్లు ఎక్కువగా నష్టపోతున్నాయి. మార్కెట్ వోలటాలిటీని  లెక్కించే వీఐఎక్స్‌‌ ఇండెక్స్‌‌  మధ్యాహ్నం 25 % పెరిగింది. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌‌లు సోమవారం సెషన్‌‌లో నెగెటివ్‌‌లో క్లోజయ్యాయి.  సెన్సెక్స్‌‌ ఇంట్రాడేలో 57 వేల మార్క్‌‌ కిందకొచ్చింది’ అని ఎల్‌‌కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్‌‌ ఎస్ రంగనాథన్‌‌ అన్నారు. స్మాల్‌‌ క్యాప్‌‌, మిడ్‌‌ క్యాప్ ఇండెక్స్‌‌లు సోమవారం 5%  మేర నష్టపోయాయని చెప్పారు. ‘గత ఐదు సెషన్‌‌లలోనే నిఫ్టీ 1,000 పాయింట్లకు పైగా నష్టపోయింది.  రానున్న సెషన్‌‌లలో వోలటాలిటీ ఎక్కువగా ఉంటుందని అంచనావేస్తున్నాం’ అని చెప్పారు. 

ఫెడ్ మీటింగ్  నిర్ణయాలు వెలువడేంత వరకు మార్కెట్‌‌లో వోలటాలిటీ కొనసాగుతుందని రెలిగేర్ బ్రోకింగ్‌‌  వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. దీనికి అదనంగా బడ్జెట్‌‌ ముందు కనిపించే కదలికలు, కంపెనీల రిజల్ట్స్‌‌,  మంత్లీ డెరివేటివ్ ఆప్షన్స్‌‌ ఎక్స్‌‌పైరీ అవ్వనుండడంతో మార్కెట్‌‌లో వోలటాలిటీ కొనసాగుతుందని చెప్పారు. ట్రేడర్లు తమ లెవరేజ్‌‌ పొజిషన్లను పరిమితంగా ఉంచుకోవాలని, రిస్క్ మేనేజ్‌‌మెంట్‌‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలని అన్నారు. ఇన్వెస్టర్లు ప్రస్తుత మార్కెట్‌‌ కరెక్షన్‌‌ను అవకాశాంగా చూడాలని, క్వాలిటీ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని సలహాయిచ్చారు. 

బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు బలహీనంగా కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎల్‌‌కేపీ సెక్యూరిటీస్‌‌ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్‌‌ దే అన్నారు. నిఫ్టీ 17,150 పైన కదిలేంత వరకు  మార్కెట్ కొంత వరకు పెరగొచ్చని అంచనావేశారు. 17,150 లెవెల్‌‌ను కోల్పోతే 17,000  వరకు పడొచ్చని అన్నారు. 

మార్కెట్లు ఎందుకు పడుతున్నాయంటే..

  •     ఇన్‌‌ఫ్లేషన్ పెరుగుతుండడంతో వడ్డీ రేట్లను పెంచేందుకు యూఎస్ ఫెడ్  మొగ్గు చూపుతోంది. బాండ్ కొనుగోళ్లను ఆపేయడానిని రెడీ అయ్యింది. దీంతో మన మార్కెట్ల నుంచి తమ ఇన్వెస్ట్‌‌మెంట్లను విదేశీ ఇన్వెస్టర్లు తీసేస్తున్నారు. 
  •     రష్యా–యుక్రేయిన్ గొడవతో మార్కెట్‌‌ల పతనం పెరుగుతోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం స్టార్టవుతుందా? అన్నట్టు పరిస్థితులు మారాయి. ఇప్పటికే బోర్డర్‌‌‌‌లో సైన్యాన్ని రష్యా మోహరించింది. యుక్రేయిన్‌‌పై దాడి చేస్తే ఊరుకోమని యూఎస్ ప్రకటించడంతో ఈ గొడవ మరింత పెద్దగా కనిపిస్తోంది.
  •     దేశంలో కరోనా ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజుకి 3 లక్షల కేసులు నమోదు కావడాన్ని చూడొచ్చు. చాలా రాష్ట్రాలు కరోనా రిస్ట్రిక్షన్లను పెడుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ తగ్గుతోంది
  •     ఇన్‌‌ఫ్లేషన్ పెరగడంతో ముడిసరుకుల ధరలు పెరిగాయి. దీంతో కంపెనీల లాభాలు తగ్గుతున్నాయి.  

కొత్త తరం కంపెనీలకు షాక్‌

కొత్త తరం టెక్‌‌‌‌ కంపెనీలకు సోమవారం షాక్ తగిలింది. జొమాటో, నైకా కంపెనీల షేర్లు 20% మేర పతనమయ్యాయి. వీటితో పాటు పేటీఎం, పాలసీబజార్‌‌‌‌, కార్‌‌‌‌ట్రేడ్‌‌ టెక్ వంటి కంపెనీల షేర్లు కూడా భారీగా పడ్డాయి. ప్రస్తుతం వీటి షేర్లు తమ ఇష్యూ ధర కంటే 20– 50% తక్కువగా ట్రేడవుతుండడాన్ని గమనించాలి. కాగా, ఈ కంపెనీలు హై వాల్యుయేషన్‌‌తో మార్కెట్‌‌లోకి లిస్టింగ్ అయ్యాయి.