మే నెల కొత్త వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో శుభారంభం చేసాయి. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ చాలా చోట్ల బీజేపీ ఆధిక్యం కనబరచటంతో మార్కెట్లలో ఉత్సాహం నెలకొంది. ప్రధానంగా బెంగాల్, అస్సాం, పాండిచ్చేరిలలో ఆధిక్యం కనబరచటంతో బుల్ జోరు కొనసాగుతోంది.
ఉదయం 10.55 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 671 పాయింట్లు, నిఫ్టీ 209 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 476 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 467 పాయింట్ల మేర లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. మార్కెట్లలో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుపై పెరుగుతున్న నమ్మకమే కొనుగోళ్లకు మద్దతు ఇస్తోందని నిపుణులు అంటున్నారు. దీనికి తోడు మార్కెట్లు సూపర్ ర్యాలీకి ఇతర కారణాలను పరిశీలిస్తే..
1. ఎన్నికల ఫలితాలు: అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్ర ఎన్నికల ట్రెండ్స్ ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి.
2. ముడి చమురు: బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 108 డాలర్లకు తగ్గడం మార్కెట్‌కు కలిసొచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలు ఇందుకు కారణం.
3. ఆటో రంగం జోరు: ఏప్రిల్ నెలలో అద్భుతమైన విక్రయాలు జరపడంతో మారుతీ సుజుకీ 4%, బజాజ్ ఆటో 4.8%, హీరో మోటోకార్ప్ షేర్లు భారీగా లాభపడ్డాయి. మారుతీ సుజుకీ ఏకంగా 33% వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
4. గ్లోబల్ మార్కెట్లు: ఆసియా మార్కెట్లు, అమెరికా మార్కెట్ల సానుకూల ప్రభావం ఇక్కడ ప్రతిఫలించింది.
