
- కలిసొచ్చిన యూఎస్, చైనా ట్రేడ్ డీల్
- నిఫ్టీ సుమారు 4 శాతం పెరిగింది
- అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లు లాభాల్లోనే
- 4 ఏళ్లలో బెస్ట్ డే
- ఒక్క రోజే రూ.16 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై: భారత్-–పాక్ మధ్య టెన్షన్స్ తగ్గడం, అమెరికా, -చైనా టారిఫ్ చర్చలు సానుకూలంగా ముగియడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లు సోమవారం దూసుకుపోయాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 3.79 శాతం లాభపడగా, నిఫ్టీ50 3.9 శాతం ఎగిసింది. అన్ని సెక్టార్లలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. రికార్డు స్థాయిలో మ్యూచువల్ ఫండ్ ఇన్‌ఫ్లోస్ రావడం, ఇండియా సావరిన్ క్రెడిట్ రేటింగ్ అప్‌గ్రేడ్ అవ్వడం వంటివి బుల్స్‌కు ఊతమిచ్చాయి.
సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలో అతిపెద్ద సింగిల్ డే లాభాన్ని సోమవారం నమోదు చేశాయి. సెన్సెక్స్ 2,975.43 పాయింట్లు (3.74 శాతం) పెరిగి 82,429.90 వద్ద, నిఫ్టీ 916.70 పాయింట్లు (3.82 శాతం) లాభపడి 24,924.70 వద్ద ముగిశాయి. ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్క సెషన్‌లోనే రూ.16.15 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.432 లక్షల కోట్ల (5.05 ట్రిలియన్ డాలర్లు) కు చేరుకుంది.
మార్కెట్ పెరగడానికి గల కారణాలు..తగ్గిన బార్డర్ టెన్షన్లు
భారత్, -పాక్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. బార్డర్ టెన్షన్లతో ఇండియన్ స్టాక్ మార్కెట్ కిందటి వారం ఒకటిన్నర శాతానికి పైగా పడగా, ఇదే టైమ్‌లో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ సుమారు 9 శాతం నష్టపోయింది. టెన్షన్స్ తగ్గడంతో నిఫ్టీ సుమారు నాలుగు శాతం, పాక్ మార్కెట్లు 9 శాతం పెరిగాయి. పాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌ను గంట పాటు నిలిపివేశారు.
టారిఫ్ వార్‌కు బ్రేక్
అమెరికా-, చైనా మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో గ్లోబల్ మార్కెట్లు లాభపడ్డాయి. ట్రేడ్ డీల్‌తో టారిఫ్ వార్ ముగుస్తుందని, గ్లోబల్ ఎకానమీ స్టెబిలైజ్ అవుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. కాగా, అమెరికా, చైనా అధికారులు కొత్త టారిఫ్‌లను 90 రోజుల పాటు నిలిపివేయాలని, ఇప్పటికే ఉన్న టారిఫ్‌లను 10 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందంతో ఆసియా మార్కెట్లు సగటున ఒక శాతం లాభపడ్డాయి. అమెరికా ఫ్యూచర్స్, క్రూడాయిల్ ధరలు కూడా ఎగిశాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లోకి భారీగా సిప్‌లు
ఈ ఏడాది ఏప్రిల్‌లో మ్యూచువల్ ఫండ్ సిప్ ఇన్‌ఫ్లోస్ రూ.26,632 కోట్లకు పెరిగాయి. రికార్డ్ లెవెల్‌ను టచ్ చేశాయి. సిప్‌ల ద్వారా జరుగుతున్న అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) రూ.13.9 లక్షల కోట్లకు చేరింది. 2024–25 లో సిప్ ఇన్‌ఫ్లోస్ ఏడాది లెక్కన 45.24 శాతం వృద్ధి చెందాయి. ఇది 2017–18 తర్వాత అత్యంత వేగవంతమైన వృద్ధి.
మెరుగుపడిన క్రెడిట్ రేటింగ్
ఇండియా సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను బీబీబీ (లో) నుంచి బీబీబీ (స్టేబుల్)కు మార్నింగ్‌స్టార్ డీబీఆర్‌ఎwస్ అప్‌గ్రేడ్ చేసింది. ఇండియా ఎకానమీ మెరుగ్గా ఉందనే సంకేతాలను ఇది ఇస్తోంది. గ్లోబల్ వోలటాలిటీ మధ్య ఇన్వెస్ట్‌మెంట్లను మరింతగా ఆకర్షించడానికి ఇండియాకు వీలుంటుంది.
అన్నిసెక్టార్లలో కొనుగోళ్లు
స్టాక్ మార్కెట్‌లో సోమవారం అన్ని సెక్టార్ల షేర్లు లాభాల్లో కదిలాయి. ముఖ్యంగా నిఫ్టీ ఐటీ 6.7 శాతం పెరిగింది. నిఫ్టీ రియల్టీ 5.9 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ 3.3 శాతం, నిఫ్టీ ఆటో 3.4 శాతం లాభపడ్డాయి. బ్రాడర్ మార్కెట్‌లో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్‌లు 4.1 శాతం చొప్పున ఎగిశాయి. ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి హెవీవెయిట్ స్టాక్స్ 4.5 శాతం నుంచి 7.7 శాతం మధ్య లాభపడ్డాయి.
కన్సాలిడేషన్ నుంచి బయటకు
టెక్నికల్‌గా చూస్తే, నిఫ్టీ తాజా కన్సాలిడేషన్ నుంచి బ్రేక్‌అవుట్ అయింది. పాజిటివ్ ట్రెండ్‌ను కన్ఫర్మ్ చేసింది. "24,350 పైన నిఫ్టీ కొనసాగేంతవరకు, మార్కెట్ పడే కొద్దీ కొనుగోళ్లు జరుగుతాయి. షార్ట్ టర్మ్‌లో ఈ ర్యాలీ 25,350/25,750 వరకు వెళ్లొచ్చు" అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ సీనియర్ ఎనలిస్ట్ రూపక్ డే అన్నారు.
ఆయిల్ కంపెనీలషేర్లు జూమ్
అమెరికా, చైనా మధ్య టారిఫ్ టెన్షన్లు తగ్గడంతో క్రూడ్ ఆయిల్ ధరలు సోమవారం 3 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 3.18 శాతం పెరిగి బ్యారెల్‌కు 65.94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆయిల్ ధరల పెరుగుదల ఎనర్జీ స్టాక్స్‌కు ఊతమిచ్చింది. గ్లోబల్ ఎకానమీ మెరుగుపడుతుందనే అంచనాలతో ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ పెరిగింది.