ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేరు చేయొద్దు

ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేరు చేయొద్దు

ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేరు చేయటం సమంజసం కాదన్నారు తెలంగాణ ఉద్యోగుల, ఉపాద్యాయుల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు.  ఉద్యోగులు వేరు ఉపాధ్యాయులు వేరంటూ విభజించి పాలించే విధానాన్ని ముందుకు తీసుకువస్తున్న ప్రభుత్వ వైఖరిని ఖండించింది. బుధవారం ఐక్యవేదిక  తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టిఇఎ) కార్యాలయం నుండి సిహెచ్ సంపత్ కుమారస్వామి, కె లక్ష్మయ్య, జి సదానందం గౌడ్ అధ్యక్షతన వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను వేరుచేసి వారి ఐక్యతకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉపాధ్యాయుల పని దినాలు తక్కువ కనుక ఉపాధ్యాయుల జీతాలు, రిటైర్మెంట్ వయస్సు పెంచాల్సిన అవసరం లేదన్నారు. ఉపాధ్యాయులను స్థానిక సంస్థల పరిధిలోకి మార్చాలనే యోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వదిలిన ఫీలర్లను ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పిఆర్సీని, రిటైర్మెంట్ వయస్సు పెంపును ఎప్పటిలానే ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ వర్తింపజేయాలన్నారు.