హైదరాబాద్ లో ఆరని మంటలు.. వరుస ప్రమాదాలతో సిటీ ఉక్కిరిబిక్కిరి

హైదరాబాద్ లో ఆరని మంటలు.. వరుస ప్రమాదాలతో సిటీ ఉక్కిరిబిక్కిరి
  • నెలరోజుల వ్యవధిలోనే నాలుగు చోట్ల ఘటనలు
  • నాంపల్లి ప్రమాదం తర్వాత హైడ్రా అలెర్ట్
  • ఫైర్ సేఫ్టీపై వ్యాపారులకు గట్టి హెచ్చరిక
  • ఆరు రోజుల్లో ముగియనున్న గడువు.. 
  • అయినా కనిపించని మార్పు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  సమ్మర్​కు ముందే వరుస అగ్నిప్రమాదాలతో సిటీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నెల రోజుల వ్యవధిలోనే నాలుగు కీలక ప్రాంతాల్లో మంటలు చెలరేగడం భద్రతా వైఫల్యాలను దారుణంగా ఎత్తిచూపుతోంది. గత నెల 24న నాంపల్లి బచాస్ ఫర్నిచర్ షాపులో ఐదుగురి ప్రాణాలు బలిగొన్న విషాద ఘటన మరువక ముందే.. ఈ నెల 7న ఫోరెన్సిక్ ల్యాబ్​లో మంటలు చెలరేగి పలు ఫైల్స్​కాలిబూడిదయ్యాయి. 

తాజాగా అమీర్​పేటలోని కోచింగ్ సెంటర్, కూకట్​పల్లిలోని ఓ మొబైల్ షాపులో జరిగిన ప్రమాదాలు ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. నాంపల్లి ఘటన తర్వాత ‘హైడ్రా’ కఠిన నిబంధనలు తెచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. ఫైర్ సేఫ్టీ ఏర్పాటుకు వ్యాపారులకు కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇచ్చిన నెల రోజుల గడువు ముగియడానికి మరో 6 రోజులే సమయం ఉన్నా.. కోట్లలో వ్యాపారాలు చేసే ప్రధాన మార్కెట్లలో కనీసం ఫైర్ ఎక్స్​టింగ్విషర్లు, స్ప్రింక్లర్లు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.

మృత్యుకుహరాల్లా గోదాములు..

గ్రేటర్​లో నివాస గృహాల అనుమతులతో బేగంబజార్, మదీనా, ఉస్మాన్ గంజ్, సీటీసీ, రాణిగంజ్ వంటి రద్దీ ప్రాంతాల్లో అక్రమ గోదాములు వెలుస్తున్నాయి. తమ సరుకు రక్షణ కోసం సీసీ కెమెరాలపై పెడుతున్న శ్రద్ధను వ్యాపారులు ప్రాణరక్షణపై చూపడం లేదు. మెట్ల దారులను సైతం వదలకుండా స్టాక్ నింపుతుండటంతో ప్రమాదం జరిగితే తప్పించుకునే దారి కూడా ఉండటం లేదు. ప్రమాదాలు జరిగిన సమయంలో గ్రేటర్​లో ఇటువంటివి10 వేల గోదాములు ఉంటాయని, వాటన్నింటినీ ఖాళీ చేయిస్తామని ప్రకటించే అధికారులు ఆ తర్వాత చర్యలు తీసుకోవడం లేదు. 

ట్రేడ్ లైసెన్స్​ ల పెరుగుతున్నా.. 

అడుగుడుగునా లోపలే నగరంలో ట్రేడ్ లైసెన్స్​ల సంఖ్య ఏటా పెరుగుతున్నా భద్రతా ప్రమాణాలు మాత్రం అడుగుడుగునా లోపిస్తున్నాయి. 2018–19లో 40,422 ఉన్న లైసెన్స్​లు, 2023 నాటికి లక్ష దాటి, 2025లో 1,20,000కు చేరుకున్నాయి. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ స్థానంలో మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పడటంతో మొత్తం లైసెన్స్​ల సంఖ్య దాదాపు 2 లక్షలకు పైగా ఉండే అవకాశముంది. 

వీటితో పాటు లక్షలాది వ్యాపారాలు అసలు ట్రేడ్ లైసెన్స్​లు లేకుండానే ఇల్లీగల్ గోదాములు, స్టాక్ పాయింట్లు నిర్వహిస్తూ ఫైర్ సేఫ్టీని పూర్తిగా గాలికొదిలేశారు. ఈ నేపథ్యంలో, లైసెన్స్ ఉన్న సంస్థలతో పాటు, లైసెన్స్ లేకుండా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ వ్యాపారాలపై కూడా ప్రత్యేక నిఘా పెట్టి ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. 

నాలుగు కేటగిరీల విభజన.. అమలు సున్నా! 

గ్రేటర్ పరిధిలో దాదాపు 6 లక్షల మంది కమర్షియల్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించినా భద్రతా ప్రమాణాల విషయంలో వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన కరువైంది. వ్యాపార సముదాయాలను నాలుగు కేటగిరీలుగా విభజించి.. వ్యక్తిగత షాపులకు స్మోక్ డిటెక్టర్లు, సిలిండర్లు (మొదటి కేటగిరీ), మల్టీ-షాపింగ్ కాంప్లెక్స్​లకు కామన్ ఫైర్ సేఫ్టీ (రెండో కేటగిరీ), బిల్డింగ్ ఓనర్లకు సెల్లార్ క్లియరెన్స్, ఫైర్ ఎగ్జిట్ల ఏర్పాటు (మూడో కేటగిరీ), ప్రమాదకరమైన టింబర్, వేస్ట్ పేపర్ గోదాములను ఇండస్ట్రియల్ ఏరియాలకు తరలించడం (నాలుగో కేటగిరీ/రెడ్ జోన్) వంటి నిబంధనలు విధించినా అమలుకు నోచుకోలేదు. 

ముఖ్యంగా నివాస ప్రాంతాల్లోని గోదాములు ఖాళీ చేయాలని గతంలో సూచించినా యథేచ్ఛగా కొనసాగిస్తుండటంతో ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ‘హైడ్రా’ వచ్చే నెల నుంచి నిబంధనలు పాటించని సంస్థలను నేరుగా సీజ్ చేస్తామని అల్టిమేటం జారీ చేసింది.

మొబైల్ షాపు దగ్ధం

కూకట్​పల్లి, వెలుగు: కూకట్‌‌‌‌‌‌‌‌పల్లిలోని ఓ మొబైల్ షాపులో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. పద్మావతి ప్లాజా గ్రౌండ్ ఫ్లోర్​లో వడ్డేపల్లి హరిబాబు గత పదేండ్లుగా శ్రీసాయి కమ్యూనికేషన్ పేరుతో షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

స్థానికుల సమాచారంతో ఫైర్​సిబ్బంది, పోలీసులు సకాలంలో ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. అప్పటికే షాపులోని కొత్త మొబైల్స్, కస్టమర్లు రిపేర్ కోసం ఇచ్చిన ఫోన్లు, యాక్సెసరీస్, ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. షాపు తెరవకముందే ఈ ఘటన జరగడంతో ప్రాణనష్టం తప్పిందని, ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.