- గ్రేటర్‌సిటీలో వరుస అగ్నిప్రమాదాలు
- మొన్న అబిడ్స్‌లో.. నిన్న యాకుత్‌పురాలో ఫైర్యాక్సిడెంట్లు
- నెల వ్యవధిలో నలుగురు మృతి
- ఫైర్ సేఫ్టీ రూల్స్గాలికి..
- తెలిసినా పట్టించుకోని ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: జనావాసాలకు దూరంగా ఉండాల్సిన పటాకుల గోదాములు ఇండ్లలోకి, భారీ షాపులు ఇండ్ల మధ్యకు రావడంతో నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. పటాకులు పేలుతుండడంతో మంటలు వ్యాపించి భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తోంది. ఫైర్‌సేఫ్టీ రూల్స్పాటించకుండా క్రాకర్స్‌షాప్‌నిర్వహిస్తుండడం, ఇండ్లలో భారీ స్థాయిలో పటాకులు నిల్వ ఉంచుతుండడంతో చిన్న నిప్పు రవ్వ పడినా, షార్ట్సర్క్యూట్జరిగినా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఆదివారం అబిడ్స్‌లోని పారస్ క్రాకర్స్ షాపులో అగ్నిప్రమాదం జరిగి ఇద్దరు మహిళలు గాయపడగా, యాకత్‌పురాలోని ఇంట్లో నిల్వ ఉంచిన పటాకులపై నిప్పు రవ్వలు పడి ఇద్దరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమతులు లేని షాప్స్ ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిసినా..ఫైర్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ నెల రోజుల వ్యవధిలోనే మూడు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు.
గాలి, వెలుతురు లేని ఇండ్లలో పటాకుల తయారీ
జనావాసాల మధ్య క్రాకర్స్ దుకాణాలు, గోదాములు పెట్టడంతో పాటు ఇండ్లలో కూడా టన్నుల కొద్ది పేలుడు పదార్థాలను నిల్వ చేస్తున్నారు. వెంటిలేషన్, గాలి సరిగ్గా లేని గదుల్లో బేరియం,అల్యూమినియం, పొటాషియం నైట్రేట్ సహా ఇతర పేలుడు పదార్థాలను నిల్వ చేసి క్రాకర్స్ తయారు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ ఇండ్లల్లో ఫైర్ సేఫ్టీ అనేదే కనిపించదు. వీటిని ఎక్కువ కాలం నిల్వ చేస్తున్నారు. ఇలాంటి చోట్లనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఇలాంటి ఇండ్లు, షాపులు ఉన్న చోట జనాలు భయపడుతున్నారు.
జనావాసాలకు దూరంగా అని చెప్పినా..
గ్రేటర్‌లో ఫైర్ క్రాకర్స్ షాపులకు అగ్నిమాపక శాఖ నిర్దిష్ట గైడ్‌లైన్స్ జారీ చేసింది. షాపులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి షాప్ నిర్వహణకు జీహెచ్‌ఎంసీ, పోలీస్, విద్యుత్ సహా ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అనుమతి తప్పనిసరి.
పర్మినెంట్, హోల్‌సేల్ షాప్స్‌లో100 కిలోల నుంచి 300 కిలోల వరకు, టెంపరరీ షాప్స్‌లో100 కిలోల వరకు మాత్రమే క్రాకర్స్ నిల్వ ఉంచాలి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. అగ్నిపమాదాలు జరిగినప్పుడు నివారించేలా ప్రతీ క్రాకర్స్ షాపు వద్ద వాటర్డ్రంబు, ఇసుక, ఫైర్ మిస్ట్ తప్పనిసరిగా అందుబాటులో పెట్టుకోవాలి. కానీ, ఈ రూల్స్ ఎక్కడా కనిపించడం లేదు.
అఫీషియల్‌గా 6104 .. అనుమతి లేనివి ఎన్నో..
దీపావళి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్దసంఖ్యలో క్రాకర్స్ షాపులు తెరిచారు. ఈ ఏడాది 6,953 దరఖాస్తులు రాగా ఇందులో 6,104 షాపులకు ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అనుమతులు ఇచ్చింది. మరో 676 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 173 దరఖాస్తులను తిరస్కరించారు. అయినా సిటీలో విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ పటాకుల దుకాణాలు వెలిశాయి.
అనుమతులు లేకుండా రోడ్లపై, జనావాసాల మధ్య వందల సంఖ్యలో షాపులు ఏర్పాటు చేశారు. రోజూ రద్దీగా ఉండే ప్రాంతాలు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల పక్కన భారీగా షాపులువెలుస్తున్నాయి.
పాతబస్తీలోని కిషన్‌బాగ్ కాశీబుగ్గ దేవాలయం సమీపంలోని ఓ ఇంట్లో గత నెల18న భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయి, తలుపులు ధ్వంసమయ్యాయి. ఇంట్లో పడుకున్న మహ్మద్ వసీం, వసీం తల్లి షాకిరా బేగం చనిపోయారు.
పటాకుల తయారీలో ఉపయోగించే పౌడర్, గులకరాళ్లు, సిల్వర్ పేపర్ ఇంట్లో నిల్వ ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. ఆరు నెలలుగా ఇంట్లోనే పటాకులు తయారు చేస్తున్నరని పోలీసుల దర్యాప్తులో తేలింది.
సుల్తాన్‌బజార్ పరిధిలోని బొగ్గులకుంట నుంచి హనుమాన్ టెక్డీకి వెళ్లే రూట్లో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన పారస్ క్రాకర్స్ షాపులో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. అప్పటికే అందులో పదుల సంఖ్యలో కస్టమర్లు ఉండడంతో భయంతో బయటకు పరుగులు తీసి ప్రాణాలు రక్షించుకున్నారు. పక్కనే ఉన్న టిఫిన్సెంటర్కు మంటలు వ్యాపించడంలో ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
8 టూవీలర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఐదు ఫైరింజన్లు ఏకధాటిగా పని చేసి మంటలను అదుపు చేసి భారీ ప్రాణ నష్టాన్ని తప్పించారు. విచారణ జరిపితే షాపు యజమాని ఎక్కడో పర్మిషన్ తీసుకుని ఇక్కడ షాపు ఏర్పాటు చేసినట్టు తెలిసింది.