V6 News

ఫడ్నవీస్ నా జీవితాన్ని నాశనం చేశాడు: బీజేపీ సీనియర్ లీడర్ ఏక్‌నాథ్

ఫడ్నవీస్ నా జీవితాన్ని నాశనం చేశాడు: బీజేపీ సీనియర్ లీడర్ ఏక్‌నాథ్

మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఏక్‌నాథ్ ఖడ్సే ఆ పార్టీకి రాజీనామా చేసి.. శుక్రవారం నాడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన పార్టీలోనే కొనసాగుతారని నిన్నటి వరకూ బీజేపీ పెద్దలు ఆశించగా ఆ ఊహాగానాలకు తెరదించారు. తాను పార్టీ నుంచి బయటకు రావడానికి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీరే కారణమంటూ బుధవారం నాడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన జీవితాన్ని ఫడ్నవీస్ నాశనం చేశారని, ఆయన వల్ల నాలుగేళ్లుగా మనోవేదన అనుభవిస్తున్నానని ఏక్‌నాథ్‌ అన్నారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో మంత్రిగా పని చేసిన ఏక్‌నాథ్ 2016లో తనపై అవినీతి ఆరోపణలు రావడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో  అప్పటి నుంచి ఏక్‌నాథ్ అసంతృప్తితో ఉన్నారు. కనీసం ఈ ఏడాది మే నెలలో వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చాన్స్ లేదు. దీంతో ఉద్దేశపూర్వకంగానే ఫడ్నవీస్ పార్టీలో తన ఇంపార్టెన్స్ తగ్గించాలని కుట్రలు చేశారంటూ ఏక్‌నాథ్‌ ఆరోపించారు. మహారాష్ట్రలో బీజేపీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అవ్వడానికి కూడా ఫడ్నవీస్ తీరే కారణమని అన్నారు.

‘దేవేంద్ర ఫడ్నవిస్ నా జీవితాన్ని నాశనం చేశారు. నాలుగేళ్లుగా మనోవేదన అనుభిస్తున్నా. మీ చర్యలతో నన్ను పార్టీ నుంచి బయటకు నెట్టేస్తున్నారని చాలా సార్లు చెప్పాను. బీజేపీని వీడుతున్నందుకు నాకూ చాలా బాధగా ఉంది. కానీ నాకు మరో చాయిస్ లేదు. రేప్ ఆరోపణలు లాంటివి కూడా నాపై చేసేందుకు గతంలో పార్టీలో కొంతమంది ప్రయత్నించారు’ అని ఏక్‌నాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.