V6 News

అక్షయ తృతీయ ధమాకా: బంగారం, వెండి దిగుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 15 బ్యాంకులకు లైసెన్స్

అక్షయ తృతీయ ధమాకా: బంగారం, వెండి దిగుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 15 బ్యాంకులకు లైసెన్స్

బంగారం, వెండి అంటే భారతీయులకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పనక్కర్లేదు. ఎందుకంటే రేట్లు పెరిగినా దానికి తగ్గని డిమాండ్ చూస్తుంటేనే ఈ విషయం అర్థం అవుతోంది. ముఖ్యంగా అక్షయ తృతీయ వంటి పర్వదినాల్లో బంగారం కొనుగోలు చేయడం ఐశ్వర్యానికి సూచికగా భావిస్తారు ఇండియన్ ఫ్యామిలీస్. ఈ క్రమంలోనే ఏప్రిల్ 20న రాబోతున్న అక్షయ తృతీయకు ముందే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో బులియన్ దిగుమతులకు సంబంధించి కొత్త బ్యాంకుల జాబితాను విడుదల చేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT) తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

విదేశీ వాణిజ్య విధానం(FTP) 2023 ప్రకారం జారీ చేసిన ఈ కొత్త ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చాయి. ఇవి మార్చి 31, 2029 వరకు అంటే మూడేళ్ల పాటు అమలులో ఉంటాయి. నిజానికి గత కొన్ని రోజులుగా పాత అనుమతులు ముగియడం, కొత్త ఆదేశాల కోసం బ్యాంకులు ఎదురుచూస్తుండటంతో బంగారం దిగుమతుల్లో జాప్యం జరుగుతోందన్న ఆందోళనలు వ్యాపారులను వెంటాడుతున్నాయి. అక్షయ తృతీయ సీజన్లో కొరత రాకుండా ఉండేందుకు కేంద్రం ఈ కీలకమైన ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ పండుగ సీజన్ దేశంలోని వార్షిక రిటైల్ అమ్మకాల్లో దాదాపు 15 నుండి 20 శాతానికి పైగా వాటాను కలిగి ఉండటమే ఆందోళనల వెనుక ప్రధాన కారణం.

కేంద్రం విడుదల కొత్త లిస్ట్ ప్రకారం.. మొత్తం 15 బ్యాంకులు బంగారం, వెండి రెండింటినీ దిగుమతి చేసుకునే అధికారాన్ని పొందాయి. ఇందులో ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి దిగ్గజ బ్యాంకులు ఉండగా.. డ్యూయిష్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కొటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ సంస్థలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కేవలం బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఈఆర్ బ్యాంకులకు ప్రత్యేక అనుమతులు లభించాయి. ఈ బ్యాంకుల ద్వారా విదేశాల నుంచి భారీగా పసిడి దిగుమతి కానుంది.

అనుమతి పొందిన బ్యాంకుల లిస్ట్ ఇదే.. 

  • Axis Bank Limited
  • Bank of India
  • Deutsche Bank
  • Federal Bank Limited
  • HDFC Bank Limited
  • Industrial and Commercial Bank of China Limited
  • ICICI Bank Limited
  • IndusInd Bank Limited
  • Indian Overseas Bank
  • Kotak Mahindra Bank Limited
  • Karur Vysya Bank Limited
  • Punjab National Bank
  • RBL Bank Limited
  • State Bank of India
  • Yes Bank Limited

ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడం, అదే సమయంలో కేంద్రం దిగుమతులకు అనుమతులు ఇవ్వటంతో కొనుగోలుదారులకు పెద్ద అవకాశంగా మారనుంది. గత వారం బంగారం ధరలు గరిష్ట స్థాయిలో ఉండటంతో రిటైల్ అమ్మకాలు కాస్త మందకొడిగా సాగినా.. ఇప్పుడు సరఫరా పెరగనుండటంతో అక్షయ తృతీయ నాటికి మార్కెట్ కళకళలాడనుందని నిపుణులు అంటున్నారు. అక్షయ తృతీయకు ముందే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అటు బులియన్ వ్యాపారులకు, ఇటు పసిడి ప్రేమికులకు పెద్ద ఊరటనిచ్చినట్టైంది.

►ALSO READ | పోస్టాఫీసుల్లోనే డబ్బు దాచుకుంటాం అంటున్న ప్రజలు.. 2026లో ట్రెండ్ ఎందుకు మారింది?