- సీఎం రేవంత్‌రెడ్డికి పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న ప్రవాస తెలంగాణవాసుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ‘తెలంగాణ ఎన్నారై కమిషన్’ ఏర్పాటు చేయాలని పీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి కోరారు. శుక్రవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆమె వెంట ఎమ్మెల్సీ, విప్ అద్దంకి దయాకర్ ఉన్నారు. అమెరికా, గల్ఫ్ దేశాలు, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లో లక్షలాది మంది తెలంగాణవాసులు నివసిస్తున్నారని ఝాన్సీరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు విద్య, వైద్యం, సేవా కార్యక్రమాల ద్వారా అభివృద్ధికి తోడ్పడుతున్నారని వివరించారు. వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక కమిషన్ అవసరమని సీఎంకు తెలిపారు. కమిషన్ ఏర్పాటుతో ఎన్నారై పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశం పెరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నారైలు, వారి కుటుంబాల కోసం ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు ఆస్తులు, భూములు, న్యాయ, పరిపాలన అంశాల్లో సహాయం అందించాలని కోరారు.
విదేశాల్లో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు తెలంగాణవాసులకు అవసరమైన సహకారం అందించే వ్యవస్థ ఉండాలని సూచించారు. ఎన్నారై పెట్టుబడుల కోసం పారదర్శక సింగిల్ విండో విధానాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైల సమగ్ర డేటాబేస్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. వారి ఆస్తులకు సంబంధించిన మోసాలు, ఇతర దోపిడీల నుంచి రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు, విదేశాల్లోని తెలంగాణ సంఘాలతో సమన్వయం చేసేందుకు కమిషన్ దోహదపడుతుందని ఝాన్సీరెడ్డి వివరించారు.
