ఇది కదా రాజకీయం అంటే: ఉద్దవ్‎కు షాకిస్తూ ఏక్ నాథ్ షిండేతో చేతులు కలిపిన రాజ్ థాక్రే

ఇది కదా రాజకీయం అంటే: ఉద్దవ్‎కు షాకిస్తూ ఏక్ నాథ్ షిండేతో చేతులు కలిపిన రాజ్ థాక్రే

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. రాజకీయాల్లో అసాధ్యమనేది ఏది ఉండదు. రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించలేం. ఇవాళ బద్ద శత్రువులుగా ఉన్నావారే రేపు ప్రాణ స్నేహితులు అవుతారు.. ఇలాంటివన్ని పాలిటిక్స్‎లో పాసిబులే. ఇటీవల జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు నిశితంగా గమనిస్తే ఇప్పుడు మనం చదివింది అంతా నిజమే అనిపిస్తోంది. ఎందుకంటారా.. 20 ఏళ్ల ఈగోను పక్కన బెట్టి మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్లీ ఒక్కటయ్యారు థాక్రే బ్రదర్స్.

 ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), రాజ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పార్టీలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. థాక్రే బ్రదర్స్ రీయూనియన్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. వీరి కలయిక మాత్రం రెండు పార్టీల కేడర్‎లో నూతనోత్తేజాన్ని నింపింది. కానీ ఈ జోష్ ఎన్నో రోజులు నిలవలేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే సోదరుడు ఉద్ధవ్ థాక్రేకు రాజ్ థాక్రే ఊహించని ఝలక్ ఇచ్చాడు. బాల్ థాక్రే స్థాపించిన శివసేనను రెండుగా చీల్చిన ఏక్ నాథ్ షిండేతో చేతులు కలిపాడు రాజ్‎థాక్రే.

►ALSO READ | గుజరాత్ ఇంజనీర్ల మహా అద్బుతం : ప్రారంభోత్సవం రోజే కూలిన 21 కోట్ల వాటర్ ట్యాంక్

కళ్యాణ్-డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కెడిఎంసి)లో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) మద్దతు ఇచ్చింది. శివసేన (యూబీటీ) బద్ద శత్రువైన షిండేతో రాజ్ థాక్రే చేతులు కలపడం మహారాష్ట్ర పాలిటిక్స్‎లో సంచలనంగా మారింది. అయితే.. స్థానిక ఎంఎన్ఎస్ నాయకుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంఎన్ఎస్ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. కళ్యాణ్-డోంబివిలి ప్రాంతంలో అభివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా షిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు ఇవ్వాలనే నిర్ణయం స్థానిక నాయకత్వం తీసుకుందని ఆ పార్టీ తెలిపింది. ఎంఎన్ఎస్ నిర్ణయంపై ఉద్ధవ్ థాక్రే ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి మరీ..

కళ్యాణ్-డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు: 

ఇటీవల ముగిసిన కళ్యాణ్-డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలోని బీజేపీ, శివసేన (షిండే) హోరాహోరీగా పోటీ తలపడ్డాయి. 122 స్థానాలు కల్గిన కళ్యాణ్-డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్‎లో శివసేన 53 స్థానాలు గెల్చుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 50 స్థానాలతో బీజేపీ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. శివసేన (UBT) 11, ఎంఎన్ఎస్ 5, కాంగ్రెస్ 2, ఎన్‌సిపి (ఎస్‌పి), 1 స్థానాల్లో విజయం సాధించాయి. కళ్యాణ్-డోంబివిలి మేయర్ పీఠం దక్కించుకోవడానికి 62 స్థానాలు అవసరం. ఎంఎన్ఎస్ మద్దతుతో శివసేన (షిండే వర్గం) బలం 58కి చేరింది. మరో నలుగురు కార్పొరేటర్లు మద్దతు ఇస్తే కళ్యాణ్-డోంబివిలి మేయర్ పీఠం దక్కించుకోవడానికి షిండే వర్గానికి లైన్ క్లియర్ అవుతోంది.