- కార్పొరేషన్‌తోపాటు మున్సిపాల్టీల్లో ఏడు నామినేషన్లు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మేడారం సమ్మక్క–సారాలమ్మ జాతర, మున్సిపల్ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండు ఒకేసారి రావడంతో పోటీ చేసే అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మేడారం వెళ్లి జాతరలో మొక్కులు చెల్లించుకోవడం, అమ్మలను దర్శించుకోవడం ఎంత ముఖ్యమో.. మున్సిపల్‌ఎన్నికల్లో నామినేషన్లు వేయడం కూడా అంతే ముఖ్యమని ఆశావహులు అంటున్నారు.
మేడారం మహా జాతర ఈనెల 28,29,30 తేదీల్లో జరుగనుంది. నామినేషన్లు వేసేందుకు అవే తేదీలను ఎన్నికల సంఘం ఖరారు చేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మేడారానికి ఎన్నికల తర్వాత వెళ్లి మొక్కులు చెల్లించుకుందామని కొందరు భావిస్తున్నారు. మరి కొందరేమో ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తొలి రోజు స్పందన అంతంత మాత్రమే..
మున్సిపల్‌ఎన్నికల్లో భాగంగా జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజైన బుధవారం జిల్లావ్యాప్తంగా ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో 60 డివిజన్లకు మూడు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఇల్లెందులో 24 వార్డులకు ఒకటి, అశ్వారావుపేటలో 22 వార్డులకు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి.
