కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ

కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ
  • అభినందనలు తెలిపిన మంత్రులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పలువురు కార్పొరేషన్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్లు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు హాజరై, కొత్త చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్‌‌‌‌గా జంగా రాఘవరెడ్డి బషీర్ బాగ్ పరిశ్రమల భవన్‌‌‌‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అటెంట్ అయి రాఘవరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌‌‌‌గా మలక్‌‌‌‌పేటలో ముత్తినేని వీరయ్య బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి సీతక్క, ఉత్తమ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎంపీ మధుయాష్కీ అటెండ్ అయి విషెస్‌‌‌‌ చెప్పారు. సీతక్క మాట్లాడుతూ.. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం దివ్యాంగులను నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరి సంక్షేమానికి సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి దివ్యాంగ సహకార, సంక్షేమ శాఖను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే దివ్యాంగుల కార్పొరేషన్ శాఖపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. దివ్యాంగుల బ్యాక్‌‌‌‌లాగ్‌‌‌‌ ఉద్యోగాలు, కోర్టుల్లో 4 శాతం ఉద్యోగాలు, సదరం స్లాట్ సులభతరం తదితర ఎన్నో అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని వెల్లడించారు. 

మినిమమ్ వేజ్ బోర్డ్ చైర్మన్‌‌‌‌గా జనక్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ బాధ్యతలు

షెడ్యూల్ ట్రైబల్ కో-ఆపరేటివ్ ఫైనాన్షియల్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ట్రైకార్)చైర్మన్‌‌‌‌గా మసాబ్ ట్యాంక్‌‌‌‌లోని సంక్షేమ భవన్‌‌‌‌లో తేజావత్ బెల్లయ్య నాయక్, గిరిజన కో ఆపరేటివ్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌‌‌‌గా కొట్నాల తిరుపతి, ఎంబీసీ కార్పోరేషన్ చైర్మన్‌‌‌‌గా జైపాల్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొన్నం, విప్ రాంచంద్రు నాయక్, మాజీ ఎంపీ మధుయాష్కీ హాజరయ్యారు.

మినిమమ్ వేజ్ బోర్డ్ కార్పొరేషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా నియమితులైన జనక్ ప్రసాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌‌‌‌లోని లేబర్ ఆఫీస్‌‌‌‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌‌‌‌ సింగ్‌‌‌‌ రాజ్ ఠాకూర్ హాజరై, శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌‌‌‌గా ఆర్‌‌‌‌‌‌‌‌.గురునాథ్‌‌‌‌ రెడ్డి లక్డీకాపూల్‌‌‌‌లోని డీజీపీ ఆఫీస్‌‌‌‌లో బాధ్యతలు చేపట్టారు.