ప్రాణహిత వరదలతో పంటలకు తీవ్ర నష్టం

ప్రాణహిత వరదలతో పంటలకు తీవ్ర నష్టం

దెబ్బతిన్నపత్తి, వరి పంటలు

9,200 ఎకరాలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా

నష్టంపై పూర్తి స్థాయిలో సర్వే చేయనున్న అధికారులు

మంచిర్యాల/ ఆసిఫాబాద్, వెలుగు: ప్రాణహిత వరదలతో మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లాల్లోని నదీ తీర గ్రామాల్లోని రైతుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 9,200 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇటీవల మహారాష్ట్రలో భారీ వర్షాలతోపాటు పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహితకు వరద పోటెత్తింది. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్​వాటర్​ కారణంగా వరద కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలవకుండా నదీతీర ప్రాంతాలను ముంచింది. దీంతో వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని 25 గ్రామాల్లో ఆరు వేల ఎకరాల్లో పత్తి, వరి పంటలు నీటమునిగాయి. రెండు రోజుల నుంచి వరదలు తగ్గుముఖం పట్టాయి. ఐదారు రోజులుగా నీటమునిగి ఉండడం వల్ల పత్తి చేలు నల్లబారిపోయాయి. చేలు, పొలాల్లో అండుపోసింది. అగ్రికల్చర్ ఆఫీసర్లు గ్రామాల్లో పంటనష్టంపై ప్రాథమిక సర్వే నిర్వహించారు. వేమనపల్లి మండల కేంద్రంతో పాటు ముల్కలపేట, రాచర్ల, క్యాతన్​పల్లి, నీల్వాయి, కల్మల్​పేట, గొర్లపల్లి, గోదంపేట, ఒడ్డుగూడెం, సుంపుటం, జాజులపేట, ముక్కిడిగూడెం, కల్లంపల్లి గ్రామాల్లో 2,800 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. 2,200 ఎకరాల్లో పత్తి, 600 ఎకరాల్లో వరి దెబ్బతిన్నది. ఇందులో ఒక్క వేమనపల్లిలోనే 800 ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారు. కోటపల్లి మండలంలోని వెంచపల్లి, జూపాక, జనగామ, ఆలుగామ, పుల్లగామ, సిర్సా, అన్నారం, అర్జునగుట్ట, రాపన్​పల్లి, దేవులవాడ, రావులపల్లి, కొల్లూరు గ్రామాల్లో 3,380 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. అత్యధికంగా అన్నారం గ్రామంలో 900 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఈ మేరకు కలెక్టర్​కు ప్రైమరీ రిపోర్టు సమర్పించినట్లు డీఏవో వీరయ్య తెలిపారు. రెండు రోజుల్లో రెవెన్యూ ఆఫీసర్లతో కలిసి రైతుల వారీగా పంటనష్టంపై

ఆసిఫాబాద్లో 3,000 ఎకరాలు

ప్రాణహిత వరదలతో ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్, చింతలమానేపల్లి, కౌటాల మండలాల్లోని తీరం వెంబడి ఉన్న చేన్లు పూర్తిగా నీట మునిగాయి. రెండు రోజులుగా వరద ఉద్ధృతి తగ్గడంతో ముంపు నుంచి బయటపడిన పంటలను చూసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ముఖ్యంగా కాయ దశలో ఉన్న పత్తి పంట, కాత దశలో ఉన్న సోయా చిక్కుడు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కౌటాల, చింతల మానేపల్లి, బెజ్జూర్, దహెగాం మండలాల్లో  మూడు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. బెజ్జూర్ మండలంలో అత్యధికంగా 1,400 ఎకరాల్లో పంటలు పాడయ్యాయి.