హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మే 23 నుంచి మే 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ సిటీలో ఇప్పటికే ఎండలు మండుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. అత్యధికంగా కార్వాన్‌లో 43.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, చాంద్రాయణగుట్టలో 43.2, అంబర్‌పేటలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మలక్‌పేట, అల్వాల్, ఏఎస్ రావు నగర్‌లలో 42.6 డిగ్రీలు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల్లో 41.8 నుంచి 42.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వచ్చే 4 నుంచి 5 రోజుల పాటు ఇదే తరహా హీట్‌వేవ్ కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది.
వర్షాకాలంలో వానలు తక్కువే పడుతాయని ఐఎండీ అంచనా వేసింది. సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. సోమవారం మాన్సూన్ ఎర్లీ రిపోర్టును ఐఎండీ విడుదల చేసింది. 92 శాతం మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ALSO READ : జియో, ఎయిర్‌టెల్‌కి నిద్ర లేకుండా చేస్తున్న BSNL..
రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల్, సిరిసిల్ల, మంచిర్యాల్, పెద్దపల్లి జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని తెలిపింది. అదే సమయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. లానినా పరిస్థితులు బలహీన పడుతున్నాయని, వర్షాకాలం నాటికి ఎల్ నినో బలపడుతుందని ఐఎండీ పేర్కొంది.
