హైదరాబాద్, వెలుగు: నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)తో పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ(స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టా చార్య ఆరోపించారు. ఎన్ఈపీని బలవంతంగా రుద్ది.. సర్కారు స్కూళ్లు, అంగన్‌వాడీలను ఎత్తివేయాలనే ఆలోచనను విరమించుకోవాలన్నారు. హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.
దీనికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీజన్ భట్టాచార్య మాట్లాడుతూ.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి కేటాయించిన రూ.12 మొత్తం సరిపోదన్నారు. దాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలోకి వస్తున్న మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా విద్యార్థి లోకాన్ని ఏకం చేస్తామని తెలిపారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ..రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించుకుండా విద్యారంగాన్ని ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
