- చర్చిల అభివృద్ధికి ఇప్పటికే రూ.130 కోట్లు ఖర్చు చేసినం
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
పద్మారావునగర్, వెలుగు: క్రైస్తవ మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఇండియన్ క్రిస్టియన్ జర్నలిస్ట్స్ కలెక్టివ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని సీఎస్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో శనివారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిల నిర్మాణాలు, మరమ్మతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాల్లేని ఇండిపెండెంట్ చర్చిలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
పాస్టర్లకు నెలకు రూ.2 వేల సహాయం హామీ ఇచ్చి ఇప్పటికే 7 వేల మందికి అందిస్తున్నామని చెప్పారు. క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ.. ఒక్క ఏడాదిలోనే చర్చిల నిర్మాణాలు, స్మశానవాటికల అభివృద్ధికి రూ.130 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రాజ్యాంగ హక్కులు, మత స్వేచ్ఛపై దాడులను క్రిస్టియన్ జర్నలిస్టులు సమాజం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, తెలంగాణ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ శంకర్ లూక్, మాజీ సీఎస్ మిని మ్యాథ్యూ, మాజీ డీజీపీలు స్వరణ్జిత్ సేన్, బాబూరావు, డీటి నాయక్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ సబిత, ప్రొఫెసర్ స్టీవెన్సన్, సీనియర్ జర్నలిస్టులు జాన్ శశిధర్, సుశీల్ రావు, జోనా రామారావు, జాషువ శ్యాంసన్, జోయెల్ కుమార్ పాల్గొన్నారు.
