ఏడాదికాలంగా జట్టుకు దూరం. ప్రతీక రావల్ గాయంతో లక్కీగా టీమిండియాలోకి ఎంట్రీ. సెమీ ఫైనల్లో ప్లేయింగ్ 11లో చోటు ఇవ్వడంతో విమర్శలు.. సెమీ ఫైనల్లో 10 పరుగులే చేసి విఫలం కావడంతో ఫైనల్ నుంచి తప్పించాలనే డిమాండ్. గత వారం నుంచి షెఫాలీపై వినిపిస్తున్న కామెంట్స్ ఇవే. కానీ అందరి విమర్శలను తిప్పికొడుతూ తన అవసరం జట్టుకు ఎంత ఉందో తెలిపింది. ఆదివారం (నవంబర్ 2) సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో బ్యాటింగ్ లో అదరగొట్టింది. 78 బంతుల్లోనే 87 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. షెఫాలీ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లతో పాటు 2 సిక్సర్లున్నాయి.
ఆరంభం నుంచి తనదైన శైలిలో దూకుడుగా ఆడుతున్న షెఫాలీ హాఫ్ సెంచరీ చేసింది. హాఫ్ సెంచరీ తర్వాత తన దూకుడు మరింత పెంచింది. ఈ క్రమంలో జట్టుకు స్కోర్ పెంచే ప్రయత్నంలో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటైంది. 13 పరుగుల తేడాలో సెంచరీ మిస్ అయినా షెఫాలీ ఇన్నింగ్స్ మాత్రం అత్యద్భుతం అని చెప్పుకోవాలి. షెఫాలీ ఔట్ కావడంతో ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 30 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. క్రీజ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ (4), దీప్తి శర్మ (1) ఉన్నారు.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఇండియాకు ఓపెనర్లు స్మృతి మందాన, షెఫాలీ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ప్రారంభంలో కాస్త ఆచితూచి ఆడినా.. ఆ తర్వాత బ్యాట్ ఝులిపించారు. సఫారీ బౌలర్లను అలవోకగా ఆడుతూ స్వేచ్ఛగా బౌండరీలు రాబట్టారు. ఈ క్రమంలో వెరీ భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. తొలి వికెట్ కు 104 పరుగులు జోడించిన తర్వాత 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మందాన ఔటైంది. స్మృతి ఔటైనా జెమీమా రోడ్రిగ్స్ తో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
రెండో వికెట్ కు 62 పరుగులు జోడించి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు.
భారీ స్కోర్ ఖాయమన్న దశలో షెఫాలీ, జెమీమా స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దీంతో ఇండియా 171 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాకా రెండు వికెట్లు పడగొట్టింది. ట్రయిన్ కు ఒక వికెట్ దక్కింది.
