World Cup 2025 Final: దేవుడి స్క్రిప్ట్.. ఇంట్లో కూర్చుని మ్యాచ్ చూసే అమ్మాయి వరల్డ్ కప్ గెలిపించింది

World Cup 2025 Final: దేవుడి స్క్రిప్ట్.. ఇంట్లో కూర్చుని మ్యాచ్ చూసే అమ్మాయి వరల్డ్ కప్ గెలిపించింది

టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మను ఎంత ప్రశంసించినా తక్కువే. ఎన్నో విమర్శల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆడిన షెఫాలీ తీవ్ర ఒత్తిడిలో రాణించి టీమిండియా వరల్డ్ కప్ టైటిల్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించింది. వరల్డ్ కప్ స్క్వాడ్ లో చోటు దక్కించుకోలేక తీవ్ర విచారానికి గురైన ఈ డాషింగ్ ఓపెనర్.. టీమిండియా మహిళల జట్టు వరల్డ్ కప్ ఆడుతుంటే టీవీల్లో చూసింది. సెమీ ఫైనల్, ఫైనల్ కు ముందు భారత మ్యాచ్ లను ఇంటిదగ్గర కూర్చొని చూసిన షెఫాలీ.. అనూహ్యంగా జట్టులోకి రావడమే కాదు.. ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకొని ఏకంగా ట్రోఫీ కలను నెరవేర్చింది. చూస్తుంటే ఇదంతా దేవుడు చేసిన ప్లాన్ లా అనిపిస్తుంది. 

ఏడాదికాలంగా జట్టుకు దూరం. ప్రతీక రావల్ గాయంతో లక్కీగా టీమిండియాలోకి ఎంట్రీ. సెమీ ఫైనల్లో ప్లేయింగ్ 11లో చోటు ఇవ్వడంతో విమర్శలు.. సెమీ ఫైనల్లో 10 పరుగులే చేసి విఫలం కావడంతో ఫైనల్ నుంచి తప్పించాలనే డిమాండ్. గత వారం నుంచి షెఫాలీపై వినిపిస్తున్న కామెంట్స్ ఇవే. కానీ అందరి విమర్శలను తిప్పికొడుతూ తన అవసరం జట్టుకు ఎంత ఉందో తెలిపింది. ఆదివారం (నవంబర్ 2) సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో బ్యాటింగ్ లో అదరగొట్టింది. 78 బంతుల్లోనే 87 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. షెఫాలీ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లతో పాటు 2 సిక్సర్లున్నాయి. 

బ్యాటింగ్ లో ఆకట్టుకున్న షెఫాలీ ఆ తర్వాత తన స్పిన్ తో మాయాజాలం చేసి మ్యాచ్ ను భారత జట్టు వైపుకు తిప్పింది. 20 ఓవర్లో సునే లూస్ ఔట్ (25) చేసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని విడగొట్టిన షెఫాలీ..ఆ తర్వాత తాను వేసిన ఓవర్లో మారిజాన్ కాప్ ను 4 పరుగుల వద్ద పెవిలియన్ కు పంపింది. 2 వికెట్ల నష్టానికి 114 పరుగులతో పటిష్టంగా ఉన్న సౌతాఫ్రికా షెఫాలీ ధాటికి రెండు కీలక వికెట్లు చేజార్చుకొని 4 వికెట్ల నష్టానికి 123 పరుగులతో నిలిచింది. షెఫాలీ ఆల్ రౌండ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

ఆదివారం (నవంబర్ 2) ముంబైలోని డీవై పాటి స్టేడియంలో జరిగిన ఈ మెగా ఫైనల్ మ్యాచ్ లో ఓపెనర్ షెఫాలీ వర్మ (78 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 87; 2/36),  దీప్తి శర్మ (58 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 58; 5/39) ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్ మెరుపులతో హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమిండియా 52  రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 298/7 స్కోరు చేసింది.అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో సఫారీ టీమ్ 45.3 ఓవర్లలో 246 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటై ఓడింది. కెప్టెన్ లారా వోల్‌‌‌‌‌‌‌‌వార్ట్ (98 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 101) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌, దీప్తికి ప్లేయర్ అఫ్ ద సిరీస్​ అవార్డులు లభించాయి.