శంషాబాద్, వెలుగు: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా డ్రోన్లను తరలించిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. సింగపూర్ నుంచి వచ్చిన మహమ్మద్, తాజ్, హస్గర్ అనే ముగ్గురు ప్రయాణికులు ఎలాంటి అనుమతులు లేకుండా తమ సామగ్రిలో డ్రోన్లను తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారిపై అనుమానం రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించగా మొత్తం 74 డ్రోన్లను రహస్యంగా తరలించినట్లు తేలింది.
వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.42 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ముగ్గురు వేర్వేరు విమానాల్లో సింగపూర్ నుంచి డ్రోన్లను తీసుకువచ్చినట్లు విచారణలో బయటపడింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
