బుల్లెట్ ట్రైన్ హబ్‌‌‌‌గా శంషాబాద్..రైల్వే కారిడార్లు టూరిస్టు ప్రాంతాలను లింక్ చేయాలి

బుల్లెట్ ట్రైన్ హబ్‌‌‌‌గా శంషాబాద్..రైల్వే కారిడార్లు టూరిస్టు ప్రాంతాలను లింక్ చేయాలి
  • హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైల్వే లైన్‌‌‌‌లో భారత్ ఫ్యూచర్ సిటీ ప్రధాన స్టేషన్
  • ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: శంషాబాద్‌‌‌‌ను బుల్లెట్ ట్రైన్ హబ్‌‌‌‌గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతిపాదిత హైస్పీడ్ రైల్వే కారిడార్లు కేవలం ప్రయాణ సాధనాలుగా మాత్రమే కాకుండా, రాష్ట్ర పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ ఆర్థిక వృద్ధికి దోహదపడేలా డిజైన్ చేయాలని ఆదేశించారు. వరంగల్ ఎయిర్‌‌‌‌పోర్టును చారిత్రక కాకతీయ సామ్రాజ్య వారసత్వ సంపద, వైభవం అడుగడుగునా ఉట్టిపడేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బుల్లెట్ రైలు (హైస్పీడ్ రైల్) ప్రాజెక్టులు, వరంగల్ ఎయిర్‌‌‌‌పోర్టు అభివృద్ధి పనులపై ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ఆర్‌‌‌‌డీలోని ‘బోధి పెవిలియన్’లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

రైల్వే కారిడార్ల సమీక్షలో భాగంగా హైదరాబాద్–పుణే బుల్లెట్ రైలు మార్గంలో వికారాబాద్‌‌‌‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి కొండల సమీపంలో కచ్చితంగా ఒక స్టేషన్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ స్టేషన్ నుంచి హైదరాబాద్ ఐటీ హబ్‌‌‌‌కు వేగవంతమైన రవాణా సౌకర్యాలను నిర్మించాలని సూచించారు. అదేవిధంగా ప్రతిష్టాత్మక హైదరాబాద్-–బెంగళూరు హైస్పీడ్ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ప్రధాన స్టేషన్ ప్లాన్ చేయాలన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా నల్లమల అటవీ ప్రాంత సౌందర్యాన్ని వీక్షించేందుకు వీలుగా మన్ననూర్ దగ్గర ఒక స్టేషన్‌‌‌‌ను, అలాగే కృష్ణా నది బ్యాక్ వాటర్స్ పర్యాటక ప్రాంతమైన సోమశిల సమీపంలో మరో స్టేషన్‌‌‌‌ను ఏర్పాటు చేసేలా రైల్వే లైన్ అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ను రూపొందించాలని స్పష్టం చేశారు.

కాకతీయ సంస్కృతి ప్రతిబింబించాలి

వరంగల్ ఎయిర్‌‌‌‌పోర్టు డిజైన్లపై సుదీర్ఘంగా చర్చించిన  సీఎం.. చారిత్రక నగరానికి తగ్గట్లుగా ఎయిర్‌‌‌‌పోర్టు అడుగడుగునా కాకతీయ సంస్కృతి ప్రతిబింబించాలని చెప్పారు. విమానాశ్రయం ముఖద్వారం ముందు ఒక భారీ ఐలాండ్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ ఐలాండ్‌‌‌‌లో కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి, రుద్రదేవుడి విగ్రహాలతో పాటు కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచే భారీ నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ డిజైన్లకు సంబంధించి ఉన్నతాధికారుల బృందం తక్షణమే ఢిల్లీకి వెళ్లి ఎయిర్‌‌‌‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపి, పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ వేం నరేందర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, టీజీఐఐసీ కమిషనర్ శశాంక, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ ప్రావీణ్య పాల్గొన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక అంశాలపై సీఎం ఈ సందర్భంగా అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.