శంషాబాద్‌‌ సమీపంలోని ATM కట్ చేసి రూ.7 లక్షలతో పరార్

శంషాబాద్‌‌ సమీపంలోని ATM కట్ చేసి రూ.7 లక్షలతో పరార్
  •     గ్యాస్ కట్టర్లు వాడిన దొంగలు  
  •     20 నిమిషాల్లోనే డబ్బుతో పరార్​
  •     ఆరు ప్రత్యేక బృందాలతో గాలింపు  

శంషాబాద్​, వెలుగు: శంషాబాద్‌‌ సమీపంలోని సతంరాయి వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను మంగళవారం తెల్లవారుజామున దుండగులు కొల్లగొట్టారు. గ్యాస్​కట్టర్స్​తో మెషీన్​ను కట్​చేసిన దొంగలు అందులోని లక్షల​ నగదును ఎత్తుకుపోయారు. అయితే, బ్యాంకు అధికారులు మాత్రం పోయిన సొమ్ము రూ.7 లక్షలు అని చెప్తుండగా, అంతకుముందు ఆ డబ్బు రూ.30 లక్షలని ప్రచారం జరిగింది. 

పోలీసుల కథనం ప్రకారం..శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సతంరాయి మెయిన్​రోడ్​పక్కన యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలోకి మంగళవారం తెల్లవారుజామున సుమారు 3.50 గంటలకు కొందరు దొంగలు చొరబడ్డారు. రాగానే, తమను గుర్తించకుండా ఉండేందుకు ఏటీఎంలోని సీసీటీవీ కెమెరాలకు రంగు స్ప్రే చేశారు. అలారం వైర్లను కట్ చేశారు.  తర్వాత చాకచక్యంగా గ్యాస్ కట్టర్లతో మెషీన్​ను ముక్కలుగా కట్ చేశారు. నగదు భద్రపరిచే కంపార్ట్‌‌మెంట్ నుంచి  డబ్బును తీసుకొని కేవలం 20 నిమిషాల్లోనే అక్కడ నుండి పరారయ్యారు. మంగళవారం ఉదయం ఏటీఎం నుంచి డబ్బులు విత్‌‌డ్రా చేయడానికి వచ్చిన కొందరు కస్టమర్లు చూసి బ్యాంకు అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

డబ్బెంత పోయింది? 

ఏటీఎంలో చోరీ జరిగిన టైంలో మెషీన్​లో సుమారు రూ.7 లక్షల నగదు ఉన్నట్లు బ్యాంకు అధికారులు చెప్పారని శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ వెల్లడించారు. అయితే, ముందు రూ.30 లక్షలకు పైగా నగదు చోరీ అయినట్లు ప్రచారం జరగ్గా, బ్యాంకు అధికారుల నుంచి ఈ లెక్కలపై స్పష్టత రాలేదు. శంషాబాద్ పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు.  

దొంగతనం వెనుక ఏదైనా అంతర్రాష్ట్ర ముఠా ఉందా లేక ప్రొఫెషనల్ దొంగల హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు కెమెరాపై పెయింట్ వేయడానికి ముందు రికార్డయిన ఫుటేజీతో పాటు, హైవే పరిసరాల్లోని ఇతర సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దుండగులను గుర్తించి పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.