- ఏసీబీ రాకతో రూ.29 వేలు బయటపారేసిన ఆర్ఐ
- మూడు రోజుల తనిఖీల వివరాలు వెల్లడించిన అధికారులు
గండిపేట, వెలుగు: శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్లో మూడు రోజుల పాటు జరిగిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ఈ కార్యాలయంలో మే 8 నుంచి సాగిన ఈ సోదాల్లో తహసీల్దార్ రవీందర్ దత్ కారు డాష్ బోర్డులో లెక్కల్లో చూపని రూ. 60 వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్ జి. కృష్ణ తన వద్ద ఉన్న రూ. 29,650 నగదును తనిఖీల సమయంలో బయటకు విసిరివేయడంతో పాటు, ఒక ముఖ్యమైన ఫైలును టాయిలెట్ పైకప్పుపై దాచేందుకు ప్రయత్నించి దొరికిపోయారు. లైసెన్స్ సర్వేయర్ పృథ్వీరాజ్ వద్ద నుంచి కూడా రూ. 10 వేల అక్రమ నగదు లభించింది. కార్యాలయంలో కనీసం వ్యక్తిగత నగదు రిజిస్టర్ నిర్వహించకపోవడం, 68 మీ-సేవ దరఖాస్తులను గడువు దాటినా పెండింగ్లో ఉంచడం వంటి నిర్లక్ష్యాన్ని ఏసీబీ గుర్తించింది.
మరీ ముఖ్యంగా, తహసీల్దార్ రవీందర్ దత్ తన అధికార పరిధిని మించి ఉన్నతాధికారుల అనుమతి లేకుండా కొన్ని ధ్రువపత్రాలు, లేఖలు జారీ చేయడమే కాకుండా, ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ (ఎల్ఆర్టీ) అధికారాలను సైతం చట్టవిరుద్ధంగా వినియోగించినట్లు విచారణలో తేలింది.
శంషాబాద్, తొండుపల్లి, శాతంరాయి గ్రామాల్లోని భూ సర్వే నంబర్ల వ్యవహారాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూరుస్తూ ప్రభుత్వ ఆస్తులకు, ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించినట్లు గుర్తించారు. మొత్తంగా ఈ కార్యాలయంలో విధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, అవినీతి కార్యకలాపాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
