నా ఫొటో వాడుకోవద్దు.. నా సిద్ధాంతాలను కాదని నాకు ద్రోహం చేశారు

నా ఫొటో వాడుకోవద్దు..  నా సిద్ధాంతాలను కాదని నాకు ద్రోహం చేశారు
  •     అజిత్ వర్గంపై శరద్ పవార్ ఫైర్ 
  •     ఇయ్యాల ఎమ్మెల్యేలతో మీటింగ్

ముంబై: పార్టీ ఫిరాయించిన అజిత్ పవార్ వర్గంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. తనకు ద్రోహం చేసినోళ్లు.. తన ఫొటోను వాడుకోవద్దని తేల్చి చెప్పారు. మంగళవారం ముంబైలో శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. ‘‘నా సిద్ధాంతాలను కాదని, నాకు ద్రోహం చేసినోళ్లు నా ఫొటోను వాడుకోవడానికి వీల్లేదు. నా ఫొటోను ఎవరు వాడుకోవాలో? వద్దో? నిర్ణయించే ప్రత్యేక హక్కు నాకుంది” అని ఆయన అన్నారు. తన పార్టీ నేతలు మాత్రమే తన ఫొటోను వాడుకోవాలని చెప్పారు. కాగా, అజిత్ పవార్ తన వర్గంతో కలిసి పార్టీ ఫిరాయించి బీజేపీ–శివసేన సర్కార్​లో చేరడంతో ఎన్సీపీలో సంక్షోభం నెలకొంది. అటు అజిత్ వర్గంతో పాటు ఇటు శరద్ పవార్ వర్గం తమదే అసలైన ఎన్సీపీ అని ప్రకటించాయి. అజిత్ వర్గం ఎన్సీపీ స్టేట్ ప్రెసిడెంట్​గా సునీల్ తట్కరేను నియమించింది. అజిత్ వెంట ఉన్న ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేను శరద్ పవార్ పార్టీ నుంచి తొలగించారు. పార్టీ ఫిరాయించిన 9 మందిపై వేటు వేయాలని స్పీకర్​కు లేఖ రాశారు. 

పార్టీలో సంక్షోభంపై లీగల్ ఒపీనియన్.. 

పార్టీలో సంక్షోభంపై శరద్ పవార్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై లాయర్లతో చర్చించారు. సతారా నుంచి సోమవారం రాత్రి ముంబై చేరుకున్న ఆయన.. న్యాయ నిపుణులతో సమావేశమయ్యారని ఎన్సీపీ జాతీయ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో తెలిపారు. ‘‘అజిత్ వర్గానికి 13 మంది ఎమ్మెల్యేలకు మించి మద్దతు లేదు. కాబట్టి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది” అని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో శరద్ పవార్ మీటింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు మొత్తం 53 మందిలో కనీసం 40 మంది తమవెంటే ఉన్నారని అజిత్ వర్గం చెబుతున్నది. కాగా, శరద్ పవార్​కు మద్దతుగా ఎన్సీపీ పుణె సిటీ యూనిట్ తీర్మానం చేసింది. 

అజిత్ ఆఫీసుకు తాళం.. 

అజిత్ పవార్ తన వర్గం కోసం ప్రత్యేకంగా పార్టీ ఆఫీసు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఆఫీసును మంగళవారం ఆయన ప్రారంభించాల్సి ఉండగా ఊహించని షాక్ తగిలింది. ఉదయం అజిత్ అనుచరులు ఆఫీసు దగ్గరికి వెళ్లగా దానికి తాళం వేసి ఉంది. చాలాసేపు వేచిచూసిన అనుచరులు.. చివరకు తాళం పగులగొట్టారు. లోపలికి వెళ్లిన వాళ్లకు మరో షాక్ తగిలింది. లోపల అన్ని రూమ్స్​కు కూడా తాళాలు వేసి ఉన్నాయి. దీంతో అక్కడి నుంచి అందరూ వెనుదిరిగారు. కాగా, పార్టీ ఆఫీసు కోసం సెక్రటేరియెట్​కు దగ్గర్లోని ఓ బిల్డింగ్ ను అజిత్ అద్దెకు తీసుకున్నారు. అది ఉద్ధవ్ థాక్రేకు సన్నిహితుడైన అంబదాస్ ధాన్వేది. ఈ ఘటన తర్వాత అంబదాస్ మరో బిల్డింగ్​ను అజిత్ కు కేటాయించారు. ‘‘పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవానికి మేం అన్ని ఏర్పాట్లు చేశాం. కానీ ధాన్వే పీఏ బిల్డింగుకు తాళం వేసుకుని వెళ్లిపోయాడు. దీని వెనుక కుట్ర దాగి ఉంది” అని అజిత్ వర్గం నేత అప్పా సావంత్ అన్నారు.