
- సెన్సెక్స్ 690 పాయింట్లు డౌన్
- 205.40 పాయింట్లు పడ్డ నిఫ్టీ
ముంబై: కంపెనీల జూన్ క్వార్టర్ రిజల్ట్స్ సీజన్ ప్రారంభంలో మందకొడిగా ఉండటంతోపాటు ఐటీ, ఆటో, ఎనర్జీ స్టాక్‌లలో భారీ అమ్మకాల కారణంగా శుక్రవారం ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు, సెన్సెక్స్ నిఫ్టీ వరుసగా మూడో సెషన్‌లో దాదాపు ఒక శాతం పడిపోయాయి. టారిఫ్ సంబంధిత సమస్యలు, గ్లోబల్ మార్కెట్లో బలహీనమైన ట్రెండ్స్ కూడా ఒత్తిడిని పెంచాయి. దీంతో 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 689.81 పాయింట్లు పడిపోయి 82,500.47 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడేలో 748.03 పాయింట్లు తగ్గి 82,442.25కి చేరుకుంది. బీఎస్ఈలో 2,450 స్టాక్‌లు నష్టాల్లో, 1,557 లాభాల్లో ముగిశాయి. 50-షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 205.40 పాయింట్లు పడి 25,149.85 వద్ద ఆగింది. ఈవారంలో బీఎస్ఈ బెంచ్‌మార్క్ 932.42 పాయింట్లు (1.11 శాతం), నిఫ్టీ 311.15 పాయింట్లు (1.22 శాతం) పడిపోయింది. ‘‘యూరప్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, యుఎస్ డౌ ఫ్యూచర్స్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి.
సాఫ్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్ రిజల్ట్స్ నిరాశపరిచాయి. ఐటీ, టెలికాం, ఆటో, రియాలిటీ చమురు, గ్యాస్ స్టాక్‌లలో భారీగా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రపంచ డిమాండ్ మందగమనం గురించి పెట్టుబడిదారులు భయపడుతున్నారు" అని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ ఎనలిస్టు ప్రశాంత్ తాప్సే అన్నారు. ఫలితాలు నిరాశపర్చడంతో సెన్సెక్స్ సంస్థల నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్3.46 శాతం పడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ట్రెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లూ నష్టపోయాయి.
హెచ్‌యూఎల్ షేర్లు జూమ్
ఈ ఏడాది ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చేలా హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) మొదటి మహిళా సీఈఓ, ఎండీగా ప్రియా నాయర్ బాధ్యతలు స్వీకరించనున్నట్టు ప్రకటించిన తర్వాత ఆ సంస్థ షేర్లు 4.61 శాతం పెరిగాయి. సెన్సెక్స్ నుంచి యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎటర్నల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా లాభాలను ఆర్జించిన వాటిలో ఉన్నాయి.
బీఎస్ఈ స్మాల్‌క్యాప్ గేజ్ 0.70 శాతం క్షీణించగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.65 శాతం పడిపోయింది. బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్‌లలో టెక్ 1.85 శాతం, బీఎస్ఈ ఫోకస్డ్ ఐటీ 1.77 శాతం, ఐటీ 1.65 శాతం, ఆటో 1.72 శాతం, చమురు, గ్యాస్ 1.28 శాతం, కన్జూమర్డిస్క్రెషనరీ 1.23 శాతం, టెలికమ్యూనికేషన్ 1.22 శాతం తగ్గాయి. హెల్త్‌కేర్, ఎఫ్ఎంసీజీ మాత్రమే లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ నష్టాల్లో, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ లాభాల్లో ముగిశాయి.
యూరోపియన్ మార్కెట్లు మిడ్-సెషన్లో తక్కువగా ట్రేడవుతున్నాయి. గురువారం యూఎస్ మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.31 శాతం పెరిగి బ్యారెల్‌కు 68.85 డాలర్లకు చేరుకుంది. ఎఫ్ఐఐలు గురువారం రూ.221.06 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు.