
హైదరాబాద్, వెలుగు: టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం వెనుక మంత్రులున్నా, ఎమ్మెల్యేలున్నా శిక్షించాలన్నారు. పీఆర్సీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల జాబ్స్‌ను భర్తీ చేయాలని గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మొత్తం ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్లను విడుదల చేయడంలో సర్కారు విఫలమైందన్నారు. ‘‘ఎన్నికలు దగ్గర పడ్తుండటంతో.. 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని కేసీఆర్ టీమ్ ప్రచారం చేసుకుంటోంది. తీరా చూస్తే ఇప్పుడు 26 వేల జాబ్స్‌కు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చి, వాటిలోనూ పేపర్ లీక్‌లకు పాల్పడింది” అని షర్మిల ఆరోపించారు. ఎన్నికలకు మరో 6 నెలల సమయమే ఉందని, ఇలాంటి టైమ్‌లో పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. ‘‘ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి ఆగస్టులోపు ఫలితాలను ప్రకటించి, సెలక్ట్ అయిన వారికి నియామక పత్రాలు అందించినా.. మిగతా 65 వేల జాబ్స్‌ను భర్తీ చేయడం సాధ్యం కాదు. సెప్టెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వస్తే అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వకపోవచ్చు” అని పేర్కొన్నారు. ‘‘కూతురు కవిత కోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపుతున్న సీఎం కేసీఆర్.. ఇదే నిబద్ధతను కడుపుకాలి, గుండెమండుతున్న నిరుద్యోగ బిడ్డల పట్ల ఎందుకు చూపడం లేదు” అని షర్మిల ప్రశ్నించారు.