
హైదరాబాద్, వెలుగు: ఇచ్చిన హామీల కంటే ఎక్కువే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామన్న మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. 8 ఏండ్లలో 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు టీఎస్ పీఎస్సీ లెక్కలే చెబుతున్నాయని, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం సౌతిండియాలోనే నిరుద్యోగంలో తెలంగాణ తొలి స్థానంలో ఉందని సోమవారం ట్వీట్ చేశారు. ‘‘వినేటోడు ఎర్రిపప్ప ఐతే.. చెప్పేటోడు ఎర్రిమాటలు ఎన్నైనా చెప్తాడట.
80 వేల పుస్తకాలు చదివిన మీ అయ్యకు, ఇలాంటి కబుర్లు చెప్పే నీకు సర్కార్ కొలువు ఇయ్యడం అంటే తెలుసా! పని చేస్తునోళ్లను పర్మినెంట్ చేసి, కొత్త ఉద్యోగం అంటారా? 2014 నుంచి మీరిచ్చిన కొలువుల్లో కొత్త నౌకర్లెన్ని? హామీల కంటే ఎక్కువే ఇచ్చినం అనే మీ డ్రామాలకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే” అని విమర్శించారు. మొదటిసారి 70 వేలు, రెండోసారి 30 వేల జాబ్స్ కు నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తంగా లక్ష ఉద్యోగాలు దాటకముందే 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.