
గణేష్ ఉత్సవాల్లో పౌరులు, ప్రత్యేకించి మహిళల భద్రత పై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. గణేష్ ఉత్సవాల్లో మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తులపై హైదరబాద్ షీ టీమ్స్ నజర్ పెట్టింది. నగరంలోని నిమజ్జన ప్రాంతాలు, వేడుక ప్రాంతాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 1612 మంది ఆకతాయలను షీ టీమ్ పోలీసులు పట్టుకున్నారు
వీరిలో 1,544 మంది మేజర్లు, 68 మంది మైనర్లు ఉన్నారు. నేరస్థులపై సంబంధిత చట్ట నిబంధనల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పట్టుబడిన మైనర్లకు అవగాహన కల్పించడానికి, అటువంటి దుష్ప్రవర్తన పునరావృతం కాకుండా నిరోధించడానికి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. పట్టుబడిన వారిలో 68 మంది 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
►ALSO READ | కరెంట్ పనిచేస్తుండగా షాక్..భవనం పైనుంచి పడి ఎలక్ట్రిషియన్ మృతి
1612 కేసుల్లో 168 కేసులు పెట్టీ కేసులుగా నమోదు కాగా వాటిలో 70 కేసులను ఇప్పటికే నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు.కోర్టు 10 కేసుల్లో రూ. 50- జరిమానా, 59 కేసుల్లో రూ. 1,050- ఒక కేసులో 2 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. మిగిలిన 98 పెట్టీ కేసులను కోర్టు ముందు హాజరుపరిచే ప్రక్రియలో ఉన్నాయి. అదనంగా, 1,444 మంది వ్యక్తులకు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.
ఏ వయస్సు వాళ్లు ఎంత మంది?
- 290 మంది 18-20 సంవత్సరాల వయస్సు
- 646 మంది 21-30 సంవత్సరాల వయస్సు
- 397 మంది 31-40 సంవత్సరాల వయస్సు
- 166 మంది 41-50 సంవత్సరాల వయస్సు
- 45 మంది 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు