కరెంట్ పనిచేస్తుండగా షాక్..భవనం పైనుంచి పడి ఎలక్ట్రిషియన్ మృతి

కరెంట్ పనిచేస్తుండగా షాక్..భవనం పైనుంచి పడి ఎలక్ట్రిషియన్ మృతి

ఊళ్లో చేసేందుకు పనిలేదు.. సిటీకిపోతే తెలిసిన ఎలక్ట్రికల్ పనితో జీవనం సాగించొచ్చు.. కుటుంబాన్ని పోషించుకోవచ్చు అనుకున్నాడు ఆ యువకుడు. కానీ విధి వక్రీకరించింది. పనిచేస్తున్న చోట అనుకోని సంఘటన.. ఊహించన ప్రమాదం..కరెంట్ రూపంలో మృత్యువు..ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ సిటీ పరిధిలోని కుత్బుల్లాపూర్లో విషాదం చోటు చేసుకుంది. బతుకుదెరువుకోసం సిటీకి ఎలక్ట్రికల్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి విద్యుత్ షాక్ తో రెండంతస్తుల భవనం పైనుంచి పడి మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబం రోడ్డునపడింది.

పేట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఎలక్ట్రికల్ పనులు చేస్తుండగా బుధవారం (సెప్టెంబర్10) ఈ ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం మెట్టకుంట్లకు చెందిన కృష్ణకు నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. బతుకుదెరువు కోసం హైదరాబాద్ లోని చింతల్ కు వచ్చి నివాసం ఉంటూ ఎలక్ట్రికల్ పనులు  చేస్తున్నాడు. 

ఈ క్రమంలో బుధవారం కొంపల్లిలోలని ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో ఎలక్ట్రికల్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది.. దీంతో రెండంతస్తుల భవనంనుంచి కృష్ణ కిందపడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.